Karimnagar : కరీంనగర్ లో త్రిముఖ పోటీ, బరిలో 28 మంది అభ్యర్థులు-karimnagar lok sabha constituency 28 members in fray for election main fight bjp brs congress ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar : కరీంనగర్ లో త్రిముఖ పోటీ, బరిలో 28 మంది అభ్యర్థులు

Karimnagar : కరీంనగర్ లో త్రిముఖ పోటీ, బరిలో 28 మంది అభ్యర్థులు

HT Telugu Desk HT Telugu
Apr 30, 2024 04:35 PM IST

Karimnagar : కరీంనగర్ లోక్ సభ స్థానానికి ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. కరీంనగర్ స్థానానికి ఈసారి 28 మంది బరిలో నిలిచారు.

 కరీంనగర్ లో త్రిముఖ పోటీ
కరీంనగర్ లో త్రిముఖ పోటీ

Karimnagar : ఉద్యమాల పురిటి గడ్డ... తెలంగాణ పోరాటానికి ఆజ్యం పోసిన అడ్డా...ఐదేళ్లలో మూడుసార్లు కేసీఆర్ ను ఎంపీగా ఎన్నుకున్న లోక్ సభ నియోజకవర్గం కరీంనగర్. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎంపీగా బీజేపీకి చెందిన బండి సంజయ్ ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో చెరికొన్ని స్థానాలు గెలుచుకుని పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి స్థానం లేకుండా చేశాయి. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. తాజా రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో దూకుడు పెంచిన రాజకీయ పార్టీల వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది?.

28 మంది అభ్యర్థులు పోటీ

ఉత్తర తెలంగాణకు మూలకేంద్రం.. రాజకీయ చైతన్యానికి నిలువెత్తు సాక్ష్యం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం. రాజకీయంగా కీ రోల్ పోషించే కరీంనగర్ లో ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా తీర్పు ఇస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ దళపతి కేసీఆర్ ను ఐదేళ్లలో మూడుసార్లు ఎంపీ(MP)గా ఎన్నుకున్న ప్రజలు, ప్రతి ఎన్నికల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్లమెంట్ విషయానికొచ్చేసరికి అనుకున్న వ్యక్తికి అప్రతిహతంగా విజయాన్ని కట్టబెట్టి దిల్లీకి పంపించిన సందర్భాలున్నాయి. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ప్రధాన పార్టీలు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావు బరిలో నిలిచి సత్తా చాటేందుకు శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు.

ఐదు జిల్లాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు

ఐదు జిల్లాల్లో విస్తరించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. కరీంనగర్(Karimnagar), జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరుగగా 9 సార్లు కాంగ్రెస్, ఉపఎన్నికలతో కలిపి నాలుగు సార్లు బీఆర్ఎస్, మూడు సార్లు బీజేపీ, ఒకసారి టీడీపీ, మరోసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి.‌ అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ట్రై యాంగిల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి.

సిట్టింగ్ ఎంపీ బండి, అధికారం పార్టీ కాంగ్రెస్

ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ(Karimnagar MP)గా బీజేపీకి చెందిన బండి సంజయ్ కొనసాగుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. పదేళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 17.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 50 వేలు అధికంగా ఉండడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. బీజేపీ హుజురాబాద్(Huzurabad) సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. హుజురాబాద్, కరీంనగర్ లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిక్యం

అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 13 లక్షల 76 వేల 685 ఓట్లు పోల్ కాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్(BRS) కు 5249 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ కు 5 లక్షల 17 వేల 601 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 5 లక్షల 12 వేల 352 ఓట్లు, బీజేపీకి 2 లక్షల 50 వేల 400 ఓట్లు లభించాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay)కి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల 98 వేల 276 ఓట్లు లభించగా నాలుగున్నర ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండు లక్షల 50 వేల ఓట్లే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ, వారికి లభించిన ఓట్లు బీఆర్ఎస్ కంటే 5249 తక్కువగా ఉండడం, బీజేపీ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కొనసాగుతుండడంతో పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కరీంనగర్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మళ్లీ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావును(Velichala Rajender) నామినేషన్ ల చివరి రోజున అధికారికంగా ప్రకటించి బరిలో నిలిపారు. కాంగ్రెస్ అభ్యర్థికి కర్త కర్మ క్రియగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వ్యవహరిస్తున్నారు.

ఐదేళ్లలో మూడు సార్లు కేసీఆర్ ఎంపీ

కరీంనగర్(Karimnagar) పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2004 లో కాంగ్రెస్ మద్దతుతో తొలిసారి ఎంపిగా గెలుపొంది కేంద్ర కార్మిక మంత్రిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూపీఏ (UPA)సర్కార్ నుంచి బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో 2006లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిస్తూ మరోసారి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉద్యమ బిడ్డగా 2008 ఉప ఎన్నికలో కేసిఆర్ ను మరోసారి కరీంనగర్ ప్రజలు గెలిపించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 52 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ పై గెలిచారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ లో పొన్నం తన వాణి వినిపించి పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు. అందరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్(Vinod Kumar) ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై వినోద్ కుమార్ 2 లక్షల ఐదు వేల మెజారిటీ తో జయకేతనం ఎగురవేశారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్(Bandi Sanjay) బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేయగా బీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 89 వేల 508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం లక్షా 79 ఓట్లు పొంది మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

ఎవరేం తక్కువ కాదు

మూడు ప్రధాన పార్టీలు తక్కువే కాదన్నట్లు వ్యవహరించడంతో తాజా కరీంనగర్ రాజకీయాలు(Karimnagar Politics) రక్తికట్టిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతల మద్య మాటల యుద్ధం సాగుతుంది. విమర్శలు.. ఆరోపణలు.. సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రజల్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పోటీ పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బహిరంగ సవాళ్లతో రాజకీయ దుమారం రేపుతున్నారు. వలసలను ప్రోత్సహిస్తూ రోజురోజుకూ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. రాజకీయ పార్టీల వ్యూహం ఎలా ఉన్నా..? చైతన్యం గల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు ఈసారి విలక్షణమైన తీర్పు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.‌ రాజకీయ పార్టీల ఎత్తుగడలను గమనిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకు మేలు జరుగుతుందో ఆ పార్టీకి పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Whats_app_banner

సంబంధిత కథనం