CPI Narayana on Modi : మోదీ గ్యారంటీ వర్కవుట్ కాక మంగళసూత్ర కామెంట్స్, బీజేపీ పాలనలో హోల్ సేల్ కరప్షన్ - సీపీఐ నారాయణ
CPI Narayana on Modi : అయోధ్య రామాలయం, మోదీ గ్యారంటీ వర్కవుట్ కాకపోవడంతో...మంగళసూత్రం అంశం తెరపైకి తెచ్చారని ప్రధాని మోదీపై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. అవినీతి చేశారని కేజ్రీవాల్ ను జైలులో పెట్టారని, మరి జగన్ ఎందుకు బయటతిరుగుతున్నారని ప్రశ్నించారు.
CPI Narayana on Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి కె.నారాయణ ఫైర్ అయ్యారు. మోదీ అందాల పోటీలకు, ఫ్యాషన్ షోలకు మాత్రమే ఉపయోగపడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కరీంనగర్ లో సీపీఐ జాతీయకార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన నారాయణ, అయోధ్యలో దేవాలయం పూర్తికాక ముందే ఎన్నికల కోసం రామాలయాన్ని ప్రారంభించారని ఆరోపించారు. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని పండితులు కూడా చెప్పారని.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అంశం కలిసి రాకపోవడంతో మోదీ గ్యారంటీ ముందుకు తెచ్చారని ఆరోపించారు. మోదీ గ్యారంటీ కూడా డూప్లికేట్ అయిపోయిందన్నారు. సగానికి సగం ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని అందువల్ల ఇప్పుడు మంగళసూత్రం అంశాన్ని పట్టుకున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసిన మోదీ మంగళసూత్రం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళసుత్రానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి మోదీ అని విమర్శించారు. మోదీ మంగళసూత్రం కట్టిన మహిళా నేడు పుట్ పాత్ పై ఉందని.. పెళ్లాం, పిల్లలు లేరని చెప్పే మోదీకి సొంత పుత్రులు లేకపోయినా 29 మంది దత్త పుత్రులు ఉన్నారని ఆరోపించారు. వారంతా బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పారిపోయారని తెలిపారు. దేశాన్ని మోదీ కాపాడకపోగా కార్పొరేట్ శక్తులకు అప్పగించి మోసం చేస్తున్నారని విమర్శించారు. అదానీ గంజాయి స్మగ్లర్ అని ఆరోపించారు. అందాల పోటీలకు.. ఫ్యాషన్ షోలకు మోదీ ఉపయోగపడతారు తప్ప ప్రజల కోసం ఉపయోగపడడని విమర్శించారు.
కేజ్రీవాల్ ను జైల్ లో పెట్టిన మోదీ...జగన్ ను ఎందుకు బయట ఉంచారు
కాంగ్రెస్ హయాంలో అవినీతి ఉందంటున్నారు మోదీ...అది రిటైల్ కరప్షన్ అయితే మోదీ వచ్చాక హోల్ సేల్ కరప్షన్ మొదలయ్యిందని ఎద్దేవా చేశారు సీపీఐ నారాయణ. వంద కోట్ల రూపాయల అరోపణలు ఎదుర్కొంటున్న అర్వింద్ కేజ్రీవాల్ ను, ఝార్ఖండ్ సీఎంను జైల్ లో పెట్టిన మోదీ, రూ.45 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్ బయటతిరిగేలా వెసులుబాటు ఇచ్చారని ఆరోపించారు. జగన్ పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయని, పదేళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నారని తెలిపారు. మోదీకి జగన్ మరో దత్తపుత్రుడని విమర్శించారు. రేవంత్ పైనో కేజ్రివాల్ పైనో కేసులు పెట్టడం కాదు... రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న మోదీపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తేనే మంచిది..కుర్రాడు జైల్లో ఉంటాడు..జైల్లో ఉంటే పొట్టిగా ఉన్న రేవంత్ పొడుగు అవుతాడు..పొడుగున్న మోదీ మరుగుజ్జు అవుతాడన్నారు నారాయణ. అదానీ ఎవరు గుజరాత్ లో ఓ గంజాయి స్మగ్లర్, అదానీ, మోదీ కవల పిల్లల్లా పెరిగారు, అదానీ గంజాయిలో పెరిగితే మోదీ రాజకీయాల్లో పెరిగారు.. మోదీ అండగా ఉండటంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం పెరిగిపోయిందన్నారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ ను మోదీ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చివరకు జ్యుడీషియరీని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
తెలంగాణలో కేసీఆర్ ఆయన కుటుంబం అహంభావం, అవినీతి వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు నారాయణ. కేంద్రంలో హంగ్ వస్తుందని, తాము కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కేంద్రంలో హాంగ్ వస్తుంది మన అవసరం పడుతుంది... మంత్రి పదవి వస్తుందని, కేసీఆర్ పగటి కలలు కంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. విభజన చట్టాలు అమలు చేయని బీజేపీనే రెండు రాష్ట్రాలకు ప్రధాన శత్రువు అన్నారు. జాతీయ స్థాయిలో మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్ధతునిస్తున్నామని తెలిపారు. కేరళలో సీపీఐ పోటీ విషయంపై అక్కడి రాజకీయాల వేరని అక్కడ కాంగ్రెస్ పైనే పోటీ చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే.. రాష్ట్రప్రభుత్వాలను చీల్చే ప్రయత్నం చేసి వారికి అనుకూలంగా మార్చుకుంటారని తెలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారనే ప్రచారం తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు నారాయణ.
HT Telugu Correspondent K.V.REDDY, karimnagar
సంబంధిత కథనం