Jagtial News : చిన్నకోల్వాయి ఓటర్లకు హ్యాట్సాఫ్, వందశాతం పోలింగ్ నమోదు
Jagtial News : జగిత్యాల జిల్లా చిన్నకోల్వాయి గ్రామంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. గ్రామంలోని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకుని 100 శాతం పోలింగ్ నమోదు చేశారు.
Jagtial News : ఓటర్ల చైతన్యం వెల్లువిరిసింది. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యతను ఓ మారుమూల గ్రామం చాటి చెప్పింది. ఓటర్లందరూ క్యూ కట్టి పోలింగ్ లో పాల్గొని వంద శాతం ఓట్ల పండుగను సక్సెస్ చేశారు. ఇప్పుడు అందరూ ఆ గ్రామం గురించే చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం చిన్నకోల్వాయి గ్రామంలో వందశాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ ప్రారంభం అయిన ఐదు గంటల్లోపే పోలింగ్ ముగించేశారు. మారుమూల గ్రామం గోదావరి నదీ తీరంలో ఉన్న అతి చిన్న గ్రామ పంచాయతీ చిన్నకోల్వాయి లో మొత్తం 110 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 65 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. అందరూ స్థానికంగానే ఉండడంతో పోలింగ్ ప్రారంభమైన వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓట్లు వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో చిన్నకోల్వాయి ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో ఒకరిద్దురు ఓటింగ్ లో పాల్గొనకపోయినా ఈసారి మాత్రం అందరూ పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఓటర్ల చైతన్యానికి నిదర్శనమని అధికారులు భావిస్తున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకే ముగిసిన పోలింగ్
చిన్న గ్రామం.. అతితక్కువ ఓటర్లు ఉన్న గ్రామం కావడంతో ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభం కాగ ఓటర్లు 12 గంటల లోపే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. వంద శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎన్నికల అధికారులు ఏజంట్ల సమక్షంలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలను సీల్ చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వందశాతం పోలింగ్ నమోదు కావడంతో ఎన్నికల అధికారులు గ్రామస్థులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకే వంద శాతం పోలింగ్ నమోదు కావడంతో పోలింగ్ కు ఇంకా ఆరు గంటల సమయం ఉండగానే చిన్నకోల్వాయిలో పోలింగ్ ముగియడంతో అక్కడ విధులు నిర్వహించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బంది పండుగ జరుపుకున్నారు. అక్కడి ఓటర్లను స్పూర్తిగా తీసుకుని ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు స్వేచ్చగా ఓటింగ్ లో పాల్గొనాలని అధికారులు కోరారు.
HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR
సంబంధిత కథనం