BRS MLA Malla Reddy : పోటీ నుంచి వెనక్కి తగ్గిన మల్లారెడ్డి ఫ్యామిలీ...! పార్టీ మార్పుపై రియాక్షన్ ఇదే
BRS MLA Malla Reddy News: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారుతున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై పార్టీ పెద్దలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనని చెప్పటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై కూడా వెనక్కి తగ్గుతున్నట్లు చెప్పారంట..!
BRS MLA Malla Reddy : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఈ లిస్ట్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ వార్తలను సదరు ఎమ్మెల్యేలు కూడా కొట్టిపారేస్తున్నారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth reddy) కలిశామని… పార్టీ మారే అవకాశమే లేదని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(BRS MLA Malla Reddy) పేరు చుట్టు జోరుగా చర్చ నడుస్తోంది.
ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే కారణాలతో మల్లారెడ్డికి చెందిన పలు భవనాలను తాజాగా రెవెన్యూ అధికారులు కూల్చేశారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటి MLRIT లో ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించిన రెవిన్యూ అధికారులు నిన్న ఉదయాన్నే భారీ బలగాల మధ్య వాటిని కూల్చేశారు.దుండిగల్ ఎంఎల్‌ఇఆర్‌టి కాలేజీని చిన్న దామర చెరువులో నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో… అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలను చేపట్టిన వారిపై కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిన్నదామర చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే అభియోగాలతో భవనాలను కూల్చివేశారు. మేడ్చల్, దుండిగల్ ప్రాంతంలోని బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించారు.
మల్లారెడ్డికి(BRS MLA Malla Reddy) చెందిన కాలేజీల కూల్చివేత నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డితో గురువారం మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి నరేందర్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన మల్లారెడ్డి చర్చలు జరిపారు. రెండు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. దీంతో ఆయన పార్టీ మారుతారనే చర్చ జోరుగా జరిగింది. ప్రభుత్వ సలహాదారుడితో రెండు గంటలకుపైగా ఏం చర్చించారని… పార్టీ మారటం ఖాయమే అన్న విశ్లేషణలు బలంగా వినిపించాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పార్టీ మారే ఉద్దేశ్యం లేదని చెప్పినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డిని కలవటంపై కూడా మల్లారెడ్డి విరవణ ఇచ్చారని సమాచారం. అయితే మొన్నటి వరకు మల్కాజ్ గిరి ఎంపీ సీటు(Malkajgiri Lok Sabha constituency) తమ కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ వచ్చిన మల్లారెడ్డి…. తాజా పరిణామాలతో వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుమారుడు భద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని… మల్కాజ్ గిరి స్థానానికి భద్రారెడ్డి పేరును పరిశీలించవద్దని కేటీఆర్ కు తెలిపినట్లు తెలుస్తోంది.
పార్టీ మారేదే లేదని చెప్పిన మల్లారెడ్డి… పోటీపై వెనక్కి తగ్గటంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు బరిలో ఉంటామని గట్టిగా చెప్పిన మల్లారెడ్డి…. ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గారనే చర్చ వినిపిస్తోంది. అయితే ఇందుకు తాజా పరిణామాలే కారణమని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. మల్లారెడ్డి వెనక్కి తగ్గటంతో… మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది…!