Illegal Constructions: వరంగల్ ట్రై సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా.. ఎక్కడికక్కడ కూల్చివేతలు షురూ
Illegal Constructions: గ్రేటర్ వరంగల్ నగరంలో అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
Illegal Constructions: వరంగల్‌లో కొద్ది రోజుల కిందట ఫుట్ పాత్ ఆక్రమణలను కూల్చేసిన అధికారులు.. అదే దూకుడు కొనసాగిస్తున్నారు. వరంగల్ చౌరస్తా ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన ఓ షాపింగ్ మాల్ పై యాక్షన్ తీసుకున్నారు.
మంగళవారం నగరంలో ఓ షాపింగ్ మాల్ ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపట్టారు. ఆక్రమణల తొలగింపుతో వరంగల్ నగరంలో ఒక్కసారిగా అలజడి మొదలవగా అక్రమంగా కట్టిన నిర్మాణాలను సంబంధిత యజమానులు సొంతంగా తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అరకొర పర్మిషన్లతో వర్ణం షాపింగ్ మాల్
వరంగల్ చౌరస్తాలో కొద్దిరోజుల కిందట వర్ణం షాపింగ్ మాల్ ఏర్పాటు చేయగా.. సంబంధిత యాజమాన్యం బిల్డింగ్ నిర్మాణానికి సరైన పర్మిషన్లు తీసుకోలేదని గ్రేటర్ వరంగల్ అధికారులు గుర్తించారు.
స్టిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది దానిని కమర్షియల్ అవసరాలకు వినియోగించడమే కాకుండా రోడ్డు వైపు ఉన్న ప్రాంతాన్ని కూడా కబ్జా చేసి కమర్షియల్ అవసరాలకు వాడుకుంటున్నారు. నిబంధనల మేరకు వారికి సెల్లార్ నిర్మాణానికి అనుమతి లేకపోగా.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందకుండానే షాపింగ్ మాల్ నడిపిస్తున్నారు.
అరకొర పర్మిషన్లతోనే షాపింగ్ మాల్ ను నిర్మించి, దర్జాగా నడిపిస్తుండటంతో బల్దియా అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు పలుమార్లు సంబంధిత యజమాన్యానికి నోటీసులు కూడా అందజేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఈ మేరకు స్టిల్ట్ పోర్షన్ పార్కింగ్ గోడలు, రోడ్డును ఆక్రమించిన ఏరియాలోని నిర్మాణాలు తొలగించారు. అంతేగాకుండా నిబంధనలు పాటించని భవనానికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంతో దానిని వెంటనే తొలగించాల్సిందిగా ఎన్పీడీసీఎల్ అధికారులకు గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా లేఖ రాశారు.
మూడు రోజుల్లో నిబంధనల మేరకు లోపాలను సవరించుకోవాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని గ్రేటర్ కమిషనర్ హెచ్చరించారు.
పర్మిషన్ ఒకలా.. కన్ స్ట్రక్షన్ మరొకలా..
వరంగల్ ట్రై సిటీలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చాలామంది బిల్డర్లు, వ్యాపారవేత్తలు టీఎస్ బీపాస్ కు సమర్పించిన వివరాల ప్రకారం కాకుండా ఇష్టారీతిన బిల్డింగులు లేపుతున్నారు. పర్మిషన్ పొందేందుకు ఒక రకమైన ప్లాన్ ఇచ్చి, వాటి ప్రకారం అనుమతులు వచ్చాక ఇష్టమొచ్చినట్టుగా నిర్మాణాలు జరుపుతున్నారు.
చాలా వరకు స్టిల్ట్ ప్లస్ పలు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుని, ఆ తరువాత పార్కింగ్ కోసం వినియోగించాల్సిన స్టిల్ట్ ఏరియాను కూడా కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇంకొంతమంది సెల్లార్లను కూడా కమర్షియల్ అవసరాలను వినియోగిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
ప్రధానంగా మడికొండ, హనుమకొండ, కాశీబుగ్గ, నక్కలగుట్ట, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, కరీంనగర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్లు గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషా తెలిపారు. వారంలోగా ఆయా నిర్మాణాలకు సంబంధించిన సవరణలు చేపట్టాలని, లేనిపక్షంలో బల్దియా ఆధ్వర్యంలో కూల్చివేతలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
పోచమ్మమైదాన్ వరకు స్పెషల్ డ్రైవ్
అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించిన మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ వరకు ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ప్రధానంగా రోడ్లను ఆక్రమించిన బిల్డింగులపై చర్యలు చేపట్టారు.
ఫుట్ పాత్ లను ఆక్రమించి ఏర్పాటు చేసిన ర్యాంపులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. అనంతరం హనుమకొండ చౌరస్తా సమీపంలోని జలేశ్వరాలయం పక్కనే ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని కూడా అధికారులు కూల్చివేశారు.
గ్రేటర్ వరంగల్ సిటీ ప్లానర్ వెంకన్న, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది, డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కూల్చివేతలు కొనసాగించారు. ఇదిలాఉంటే వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించుకోవాల్సిందిగా గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా డెడ్ లైన్ పెట్టడంతో.. కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన యజమానులు పలువురు పొలిటికల్ లీడర్ల వద్దకు పరుగులు తీయడం చర్చనీయాంశమైంది.
గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువగా అక్రమ నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలుండగా.. తాజాగా పవర్ లోకి వచ్చిన నేతలు అధికారులకు సహకరిస్తారో.. అక్రమార్కులకు వత్తాసు పలుకుతారో చూడాలి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)