AP Palasa Election Fight: సీదిరి వర్సెస్ శిరీష.. పలాసలో గెలుపెవరిది…? సిక్కోలులో ఆసక్తికరంగా మారిన ఎన్నికలు-seediri vs sirisha who will win in palasa an interesting election in sikkolu ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Palasa Election Fight: సీదిరి వర్సెస్ శిరీష.. పలాసలో గెలుపెవరిది…? సిక్కోలులో ఆసక్తికరంగా మారిన ఎన్నికలు

AP Palasa Election Fight: సీదిరి వర్సెస్ శిరీష.. పలాసలో గెలుపెవరిది…? సిక్కోలులో ఆసక్తికరంగా మారిన ఎన్నికలు

Sarath chandra.B HT Telugu
Apr 26, 2024 05:00 AM IST

AP Palasa Election Fight: అభివృద్ధికి దూరంగా ఉండే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గంలో టీడీపీ-వైసీపీల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది.

పలాసలో గెలుపెవరిది... మంత్రి సీదిరి వర్సెస్ శిరీష
పలాసలో గెలుపెవరిది... మంత్రి సీదిరి వర్సెస్ శిరీష

AP Palasa Election Fight: రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే అదృష్టాన్ని సొంతం చేసుకున్న నాయకుల్లో సీదిరి అప్పలరాజు ఒకరు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పలా నుంచి గెలిచిన అప్పలరాజు సామాజిక సమీకరణల్లో భాగంగా 2022లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కించుకున్నారు. ఎంత వేగంగా రాజకీయాల్లో ఎదిగారో అంతే వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరిగా అప్పలరాజు నిలిచారు.

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గానికి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 16,274 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2022 క్యాబినెట్ బినెట్‌ విస్తరణలో మంత్రి వర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు.

తాజా ఎన్నికల్లో పలాస నుంచి టీడీపీ తరపున గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. శిరీష తండ్రి శివాజీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014ఎన్నికల్లో గౌతు శివాజీ పలాస నుంచి గెలుపొందారు. ఆయన కుమార్తె మాత్రం 2019లో ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ హామీలు…

పలాస నియోజక వర్గానికి 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ప్రధాన హామీల్లో సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమంలో ఆందోళన కారులు, రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తేస్తామని హామీతో పాటు బీల ప్రాంతానికి సంబంధించిన జీవో 329 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ మాత్రం పట్టించుకోలేదు.

కిడ్నీ బాధితుల్లో ప్రతి 500మంది రోగులకు ఓ హెల్త్ వర్కర్‌ను నియమిస్తామనే హామీ నెరవేరలేదు. ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం సంగతి మర్చిపోయారు. జిల్లాలో సీకేడీ రోగులు 8వేల మంది ఉంటే కేవలం 451మందికి మాత్రమే రూ.5వేల పెన్షన్ అందుతోంది.

తిత్లీ తుఫాను సమయంలో నష్టపోయిన కొబ్బరి రైతులకు పరిహారం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 7వేల మంది రైతులు ఇప్పటికీ పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు. తిత్లీ తుఫాను బాధితుల కోసం భోజనాల బిల్లుల్ని కూడా ఇప్పటికీ చెల్లించలేదు.

వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు నుంచి నీళ్లపేట వద్ద జెట్టీ ఏర్పాటు చేస్తామని జగనం హామీ ఇచ్చారు. ఫిష్‌ లాండింగ్ సెంటర్ ఏర్పాటు కోసం రూ.11.95కోట్ల మంజూరైనా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. ఇసుక దిబ్బల్ని మాత్రం చదును చేసి సిమెంట్ పలకలు మాత్రం ఏర్పాటు చేశారు. పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

పలాస మండలం రేగుల పాడు మండలం వద్ద ఆఫ్‌షోర్ జలాశయం పనుల్ని పూర్తి చేస్తామని ప్రకటించినా నాలుగేళ్లుగా ఒక్క రుపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. పలాస పట్టణానికి తాగునీటి సమస్యను పరిష్కరించే రేగులపాడు ఆఫ్‌షోర్‌ పనుల్ని పట్టించుకోలేదు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంస్థ అభివృద్ధికి నిధులు, నౌపడ-కోసంగిపురం రెండు వరుసల రహదారి నిర్మాణం, వంశధార నీరు సముద్రంలో కలవకుండా బెండిగేటు వద్ద రూ.7కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణం వంటివి పూర్తి కాలేదు.

పలాస రైలు నిలయం పక్కనున్న వంతెన నిర్మాణానికి 2008లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు దొర శంకుస్థాపన చేశారు. 2014ల గౌతు శివాజీ మరోసారి శంకుస్థాపన చేశారు. 2021లో మూడోసారి శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం మొదలైన వెంటనే ఆగిపోయాయి.

కాశీబుగ్గలో రైతు బజారు ఏర్పాటు, పలాసలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, కళింగ గెడ్డపై దోని నిర్మాణం, నువ్వుల రేవు-మంచినీళ్ల పేట వద్ద జెట్టీ ఏర్పాటు వంటి పనులు అతీగతి లేదు.

మంత్రిపై ఆరోపణలు...

మంత్రి పదవి వచ్చిన తర్వాత సీదిరి అప్పలరాజుపై వచ్చిన ప్రధాన ఆరోపణల్లో విశాఖ కేంద్రంగా హార్క్‌ అనే ఫార్మా కంపెనీ నడుపుతున్నారనే ప్రచారం ఉంది. విశాఖలో రియల్‌ ఎస్టేట్ వ్యాపారాలు, కేటీరోడ్డు విస్తరణలో వ్యాపారులకు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆరోగ్య కార్యకర్తల పోస్టుల భర్తీలో వసూళ్లు, పెసరపాడులో అంగన్ పోస్టు భర్తీకి పార్టీ నాయకుల మధ్య వేలంపాట, కాశీబుగ్గ పారిశ్రామిక వాడలో మాజీ ఎంపీపీ నిమ్మాన బైరాగికి చెందిన 1.10సెంట్ల భూమి కబ్జా, కాశీబుగ్గ వంతెన నిర్మాణంలో కాంట్రాక్టురుపై ఒత్తిడి చేయడంతో వంతెన నిర్మాణం అర్థాంతరంగా నిలిచి పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

మంత్రి సోదరుడు సీదిరి త్రినాథరావు స్థానికంగా పెత్తనం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కాశీబుగ్గ కోసంగిపురం వద్ద గోల్డెన్ ల్యాండ్ భూముల విక్రయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో మంత్రి భార్య కూడా ఆర్ధిక వ్యవహారాలను నడిపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

నియోజక వర్గంలో ప్రధాన సమస్యలు...

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో శాశ్వత తాగునీటి పథకం లేదు. 64వేల జనాభా ఉన్న గ్రేడ్ 2 మున్సిపాలిటీలో చేతిపంపులు, పవర్ బోర్లపైనే ఆధారపడ్డారు. ఇంటింటి సరఫరా, పబ్లిక్ కుళాయిలకు పారసాంబ పొలాల నుంచి నీటిని తరలిస్తున్నారు. ఏడాది పొడవున నీటి ఇక్కట్లు తప్పవు. ఏటా లక్షల ఖర్చు చేసి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపి వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో కేటీరోడ్డు ధ్వంసమైపోయినా కనీసం మరమ్మతులు కూడా చేయలేదు.

పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కార్మికులు తగినంత మంది లేకపోవడంతో నిత్యం సమస్యలు తలెత్తున్నాయి. డ్రైవర్లు లేకపోవడంతో చెత్త తరలింపుకు కూడా తిప్పలు తప్పడం లేదు.

పలాస పురపాలక సంఘంలో అంగన్‌ వాడీ కేంద్రాలు లేకపోవడంతో చిన్నారుల పౌష్టికాహారం ఇబ్బందిగా మారుతోంది. 15వార్డుల మునిసిపాలిటీ 31వార్డులకు పెరిగినా అంగన్‌ వాడీ కేంద్రాలు మాత్రం పెరగలేూదు. వంశధార కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా నీరు వస్తుందని చెబుతున్నా పలాస, వజ్రపు కొత్తూరు మండలాల రైతులకు సాగునీరు అందని ద్రాక్షగా మారుతోంది.

మందస మండలం...

మండలంలోని బహాడపల్లిలో సమీపంలోని జంతిబంద జలాశయంగా అభివృద్ధి చేస్తే మందస, వజ్రపు కొత్తూరు సాగునీటి, తాగునీటి కష్టాలు తీరుతాయి. గత ప్రభుత్వం ప్రారంభించిన పనుల్ని మధ్యలో ఆపేశారు.

పితాతొలి పంచాయితీ పరిధిలోని పుచ్చపాడు మార్గంలో గెడ్డపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైనా మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వర్షకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాళ్లగురంటి పంచాయితీ గౌడుగురింటి గ్రామం మహేంద్రతనయ నది ఒడ్డున ఉంటుంది. ఏటా వర్షకాలంలో నది ప్రవాహం మారి గ్రామం కోతకు గురవుతున్నా రక్షణ గోడ నిర్మాణ పనులు మాత్రం చేపట్టడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలోని చీపి -బుడంగోల మధ్య రెండు గెడ్డలపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. చీపి సమీపంలో వంతెన దశాబ్దల క్రితం వరదల్లో కొట్టుకుపోయింది. డబార్శింగి జలాశయం శిథిలమైనా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదు.

వజ్రపు కొత్తూరు మండలం....

వజ్రపు కొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్ల పేట ఉప్పుటేరు మధ్య జెట్టీ నిర్మించకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒంకులూరు వద్ద రాకాసి గెడ్డ శిథిలావస్థకు చేరింది. వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదుగా తాళభద్ర రైల్వే గేటు వరకు రెండు వరుసల రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నువ్వలరేవు నుంచి బెండి మీదుగా బెండిగేటు, వెంకటాపురం, రేగులపాడు ఆఫ్ షోర్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం