Mulapeta Port Foundation: శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి-chief minister jaganmohan reddy will lay the foundation stone of mulapeta port today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mulapeta Port Foundation: శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Mulapeta Port Foundation: శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 08:46 AM IST

Mulapeta Port Foundation: మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారిపోతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు శంకు స్థాపన చేయనున్నారు.

మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయనున్న సిఎం జగన్
మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేయనున్న సిఎం జగన్ (face book)

Mulapeta Port Foundation: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్ధాల కలను నెరవేరుస్తూ శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్దికి బాటలు వేసేలా సంత బోమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.

10 ఏళ్ళలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్ధితుల్లో, 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభమై, శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. కాకినాడ సెజ్‌ పోర్టులో కూడా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు వచ్చే నెలలో మచిలీపట్నం పోర్టుకు కూడా శంకుస్ధాపన చేయనున్నారు.

మూలపేట పోర్టు శంకుస్థాపనతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ. 365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు రూ. 176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ. 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా నేడు శంకుస్ధాపన చేయనున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల అకాంక్ష…

23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్ధ్యంతో మూలపేట పోర్టులో 4 బెర్తుల నిర్మాణం జరుగనుంది. జనరల్‌ కార్గోకు, బొగ్గు రవాణ కు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. 30 నెలల్లో పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత మూలపేట పోర్టు కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

సుమారు రూ. 16.000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీ పట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ. 109 కోట్లు కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో అధునాతన వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ నిర్మాణం చేపట్టారు. మూలపేట పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

మూలపేట పోర్టు విశేషాలు..

మూలపేట పోర్టు సామర్ధ్యం 23.5 మిలియన్‌ టన్నులు ఉంటుంది. 4 బెర్తులను నిర్మిస్తారు. ఎన్‌హెచ్‌ 16 ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపడతారు. నౌపడ జంక్షన్‌ నుండి పోర్టు వరకు 10.6 కి.మీ రైల్వే లైన్‌ నిర్మిస్తారు. గొట్టా బ్యారేజ్‌ నుంచి 50 కి.మీల పైప్‌ లైన్‌తో 0.5 ఎంఎల్‌డీ నీటి సరఫరా చేస్తారు. పోర్టుకు అనుబంధంగా 5000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు.

సిక్కోలు మత్స్యకారులకు బాసటగా…

2018 నవంబర్‌ 27న పాకిస్తాన్‌ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీ జైలులో 20 మంది మత్స్యకారులు గడిపారు. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేయించడంలో జగన్‌ ప్రభుత్వం సఫలమైంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో గుజరాత్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 3,064 మంది మత్స్యకారులను రూ. 3 కోట్ల ఖర్చుతో 46 బస్సుల ద్వారా స్వస్ధలాలకు చేర్చారు. ఇలాంటి పరిస్ధితులు పునరావృతం కాకూడదనే సంకల్పంతో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 పిషింగ్‌ హార్బర్‌లు, 3 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ పొడవునా ఒక పోర్టు లేక ఒక ఫిషింగ్‌ హార్బర్‌ దిశగా అడుగులు వేస్తోంది.

ఇప్పటికే ఉన్న 6 పోర్టులు, రానున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరం కోసం వచ్చే నెలలోనే భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్ధాపన చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. భోగాపురం – విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మించనున్నారు.

పోర్టు నిర్మాణంతో స్థానికులకు విస్తారంగా ఉపాధి అవకాశాలు…

శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపదతో స్థానికులకు ఉపాధి లభించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్‌ కోల్, కోకింగ్‌ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కీలకంగా మారుతుంది.

ఉక్కుతయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు మినరల్‌ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశం లభిస్తుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. తీరప్రాంత–పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ. 35 కోట్లతో పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ది చేస్తారు.

 

టీ20 వరల్డ్ కప్ 2024