Aqua Problems : అక్వా సంక్షోభం చంద్రబాబు పుణ్యమేనన్న సీదిరి అప్పలరాజు
Aquaproblems ఆక్వా రంగంలో బడా వ్యాపారుల నుంచి తన వాటా పోతుందన్నదే చంద్రబాబు ఆక్రోశమని, ఆక్వా రంగంలో ఒడిదుడుకులు ఉన్నా.. బాబు సృష్టించిన కృత్రిమ సంక్షోభం కారణంగానే సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. పదెకరాల లోపు ఆక్వా రైతులకు రూ. 1.50కే విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతాంగానికి 5 ఏళ్ళలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదన్నారు.
Aquaproblems రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఎగ్గొట్టిన సబ్సిడీతో కలిపి ఆక్వా రైతులకు రూ.2,647 కోట్లు ఇచ్చామని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. అధికారంలో ఉండగా సబ్సిడీ ఇవ్వలేని బాబు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బాబు హయాంలో ఆక్వా రంగానికి కేటాయింపులు సున్నాఅని, ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకే, గిట్టుబాటు ధర ప్రకటించారన్నారు. ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
"చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలపాటు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ. 3.86 పైసలకు ఇచ్చాడని, తన పాద యాత్రలో జగన్ గారు రూపాయిన్నరకే సబ్సిడీతో విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చాక, అధికారం నుంచి దిగిపోయే చివరి ఆరు నెలల ముందు మాత్రమే రూ. 2కు తగ్గిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారని మంత్రి అప్పలరాజు విమర్శించారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధర తగ్గించినా, డిస్కమ్ లకు కట్టాల్సింది మాత్రం కట్టకుండా దిగిపోయాడన్నారు.
సబ్సిడీ భారం చెల్లించకపోవడంతో మళ్ళీ ప్రభుత్వం మీదనే పడిందని, చంద్రబాబు హయాంలో ఐదేళ్ళూ ఆక్వా రైతులకు ఎటువంటి సబ్సిడీ అందలేదన్నారు. ఆక్వా రైతాంగాన్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడేదో నష్టం జరిగిపోతుందంటూ సదస్సులు పెట్టి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పది ఎకరాల లోపు ఆక్వా రైతులకు మా ప్రభుత్వం రూపాయిన్నరకే సబ్సిడీ కింద విద్యుత్ ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రపంచ మార్కెట్ లో ఉన్న ఒడి దుడుకులు కారణంగానే ఆక్వా రంగంలో తాత్కాలిక సంక్షోభం ఏర్పడిందని, చంద్రబాబు సృష్టించిన కృత్రిమ సంక్షోభం మాత్రం శాశ్వతం అని ఎద్దేవా చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టి, విత్తనం నుంచి అమ్మకం వరకూ అన్నీ చూస్తున్న ప్రభుత్వం ఇది. ఆక్వా రైతులకు కూడా ఇదే పద్ధతిలో గిట్టుబాటు ధర ఇవ్వడానికి, అవసరమైతే కొనుగోలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడమని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్ కు సంబంధించిన ఆధిపత్యం అంతా సంపూర్ణంగా చంద్రబాబు మద్దతుదారుల కంపెనీలకే ఉందని, ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో, చంద్రబాబు నాయుడికి మనీ స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఆక్వా రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గించి, తద్వారా సంపాదించిన డబ్బుని ఫండింగ్ గా ఇచ్చిన బడా కంపెనీల యజమానులేనన్నారు. ఆ కంపెనీలు కూడా చంద్రబాబు మిత్రులు, బంధువులవేనని మంత్రి చెప్పారు.
ఆక్వా అసోసియేషన్ తరఫున ప్రభుత్వం చెప్పిన గిట్టుబాటు ధరకు కట్టుబడతామని, ప్రభుత్వం మాకు మేలే చేస్తుందని చెప్పినందుకు వారిని బెదిరించామంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. చంద్రబాబు ఆక్వా రైతుల తరఫున కాకుండా, ఆక్వా కంపెనీల తరఫున ఎందుకు మాట్లాడుతున్నాడనే దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. బాబు అధికారంలో ఉండగా రైతులకు తక్కువ ధర ఇచ్చి, వాళ్ళను మోసం చేసి, తద్వారా వచ్చిన లాభాల్లో కొంత వాటాను చంద్రబాబు గారికి ఇచ్చేవారని ఆరోపించారు. ఆక్వా రైతులకు మేలు చేశారో, ఎవరు ఆక్వా రైతులకు ద్రోహం చేశారో అందరికీ తెలిసినా, మరోసారి రూపాయిన్నరకే ఇస్తానంటూ చంద్రబాబు చెల్లని హామీ ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు.
టాపిక్