Janasena Manifesto on Wedding Card : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడ జిల్లా పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఓ వ్యక్తి తన వివాహ కార్డుపై జనసేన పార్టీ మేనిఫెస్టోను(Janasena Manifesto on Wedding Card) ముద్రించారు. తన పెళ్లి కార్డు పిఠాపురంలో బంధువులకు అందించిన ఆయన...పవన్ కల్యాణ్ కు ఓటు వేయాలని కోరారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి చంద్రబాబు, దుర్గ దంపతుల కుమారుడు వీరబాబు(కామేష్)కు ఈ నెల 4న పెళ్లి జరిగింది. అయితే కామేష్ తన పెళ్లి కార్డుపై పవన్ కల్యాణ్ ఫొటో ముంద్రించారు. దీంతో పాటు జనసేన మేనిఫెస్టో ముద్రించారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరారు. తన బంధువులకు పెళ్లి కార్డు అందించిన ఆయన జనసేనకు మద్దతుగా నిలవాలని కోరారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరీ యాత్ర(Pawan Kalyan Vahari Yatra)లో భాగంగా ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో సభ నిర్వహించనున్నారు. 8వ తేదీన ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. తీవ్రమైన జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభలకి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ రేపటి నుంచి ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగించనున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేయనున్నారు.
పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan House) కోసం ఇల్లు సిద్ధం చేస్తున్నారు. పిఠాపురంలోనే ఉంటానని, ఇల్లు తీసుకుంటానని ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ తరుణంలో కాకినాడ-కత్తిపూడి మార్గంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవే పక్కన కొత్త ఇంటిని పవన్ కల్యాణ్ అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చేబ్రోలుకు చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన ఇంటిని పవన్ కల్యాణ్ తాత్కాలికంగా అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఈ ఇంట్లోనే పవన్ కల్యాణ్ ఉగాది వేడుకలు జరుపుకుంటారని తెలుస్తోంది. జనసేన నేతలు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు పిఠాపురంలో సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు పవన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. పిఠాపురాన్ని తన సొంత ఊరుగా చేసుకుంటానని పవన్ చెప్పిన కొద్ది రోజుల్లోనే యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు జరుగుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.