Chiranjeevi - Pawan Kalyan : కళ్యాణ్ బాబు... నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉంది - చిరంజీవి అభినందనలు
Andhrapradesh Election Results 2024 : ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్ కు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు.
Chiranjeevi Wishes to Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఒక అన్నగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
“డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు.
పవన్ సూపర్ విక్టరీ….
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని నమోదు చేశారు.పిఠాపురంలో వంగా గీత మీద పవన్ కళ్యాణ్ సాధించిన ఈ విజయాన్ని జన సైనికులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైద్రాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరారు.
అల్లు అర్జున్ ట్వీట్….
ప్రజలకు సేవ చేసే క్రమంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్న సందర్భంగా పవన్ కల్యాణ్‍కు శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. “అద్భుతమైన విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రజలకు సేవ చేసేందుకు మీ అంతులేని కృషి, అంకితభావం ఎప్పుడూ మా మనసులను తాకుతుంటోంది. ప్రజలకు సేవ చేసేందుకు కొత్త ప్రయాణం కోసం మీకు బెస్ట్ విషెస్” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
మే నెలలో ఏపీ ఎన్నికల పోలింగ్‍కు ముందు వైఎస్‍ఆర్ సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి.. అల్లు అర్జున్ మద్దతు తెలపడం కాస్త దుమారం రేపింది. జనసేనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో బన్నీపై కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తనకు పార్టీలతో సంబంధం లేదని స్నేహం కోసమే వ్యక్తిగతంగా శిల్పా రవికి మద్దతు ఇచ్చానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఆ తర్వాత, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఈ వివాదాన్ని మరింత ఎక్కువ చేసింది. ఆ తర్వాత నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేయడం, రోజులు గడవటంతో ఈ వివాదం సద్దుమణిగింది.