Bonda Uma: బొండా ఉమా ఇరుక్కున్నారా.. ఇరికిస్తున్నారా…జగన్‌పై దాడి కేసులో రకరకాల మలుపులు-is bonda uma trapped various twists and turns in jagans attack case ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bonda Uma: బొండా ఉమా ఇరుక్కున్నారా.. ఇరికిస్తున్నారా…జగన్‌పై దాడి కేసులో రకరకాల మలుపులు

Bonda Uma: బొండా ఉమా ఇరుక్కున్నారా.. ఇరికిస్తున్నారా…జగన్‌పై దాడి కేసులో రకరకాల మలుపులు

Sarath chandra.B HT Telugu
Apr 18, 2024 08:49 AM IST

Bonda Uma: ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై దాడి వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పేరు తెరపైకి రావడం కలకలం రేపింది. జగన్‌పై దాడి వెనుక రాజకీయ కోణం ఉందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బొండా ఉమా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో బొండా ఉమా

Bonda Uma: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి  Attack ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, TDP టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా Bonda Umaను ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ Ysrcp వర్గాలు మాత్రం టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి చేశారని చెబుతున్నారు.

సీఎం జగన్‌పై దాడి కేసులో సింగ్‌నగర్‌కు చెందిన సతీష్, దుర్గారావులు కీలకంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు. సతీష్, ఆటో డ్రైవర్‌ దుర్గారావుతో పాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు సంబంధం ఉందనే ప్రచారంతో టీడీపీ TDP నేతలు ఉలిక్కి పడ్డారు.

విజయవాడ సెంట్రల్Vijayawada Central  నియోజక వర్గం నుంచి 2014లో గెలిచిన బొండా ఉమా 2019లో ఓటమి పాలయ్యారు. తిరిగి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమాను ప్రకటించింది. వైసీపీపై దూకుడుగా వ్యవహరించే నాయకుల్లో బొండా ఉమా ఒకరు.

ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, బొండా ఉమాలు తలపడుతున్నారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగినపుడు వెల్లంపల్లి కూడా గాయపడ్డారు. గత శనివారం విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కొట్ల సెంటర్‌లో బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో జరిగి రాయి దాడిలో వెల్లంపల్లి కంటికి గాయమైంది. ఈ ఘటనలో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఎనిమిది మందిని గత మూడ్రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారి అచూకీ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ కేసులో తమ వారిని ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు.వైసీపీ నాయకుల ప్రోద్భలంతో తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తోంది.

టార్గెట్ బొండా ఉమా...!

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి వ్యవహారం మొత్తం టీడీపీ అభ్యర్థి బొండా ఉమా చుట్టూ తిరుగుతుండటంతో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. తనను కేసులో ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని బొండా ఉమా ఆరోపించారు.

బుధవారం ముఖ్యమంత్రపై దాడి వ్యవహారంలో సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొండా ఉమా తరపున పార్టీ ప్రచారం చేస్తున్న దుర్గారావును అదుపులోకి తీసుకోవడంతో కేసులో తనను ఇరికిస్తారనే అనుమానాలు తలెత్తాయి.

మరోవైపు సిఎం జగన్‌‌పై దాడి వ్యవహారంలో పోలీసుల అదుపులోకి తీసుకున్న మైనర్ల అచూకీ కోసం హెబియస్ కార్పస్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది సలీం తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నారని, కోడికత్తి కేసు తరహాలో ఈ కేసు కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న 24గంటలలో కోర్టులో హాజరు పరచాలని, 48గంటలు దాటినా మైనర్ల అచూకీ లేదని, విచారణ పేరుతో పోలీసులు అదుపులో ఉంచుకోవడం చట్ట విరుద్ధమన్నారు. మరోవైపు విజయవాడ పోలీసులు నేడు నిందితుల్ని కోర్టులో హాజరు పరచనున్నారు. ఏ1గా సతీష్, ఏ2గా బొండా ఉమా అనుచరుడు ఆటోడ్రైవర్ దుర్గారావులను చూపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై దాడి తర్వాత నిందితుడు సతీష్‌ స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నట్టు గుర్తించారు.

రాజకీయ కారణాలేనా…?

విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో 2019లో ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలిచారు. రాష్ట్రంలో అతి తక్కువ ఓట్లతో గెలిచిన అభ్యర్థుల్లో మల్లాది విష్ణు ఒకరు. తాజా ఎన్నికల్లో విష్ణుకు సీటు నిరాకరించిన వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో మాజీ మంత్రి వెల్లంపల్లికి విజయవాడ సెంట్రల్ టిక్కెట్ కేటాయించింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే వెల్లంపల్లి ప్రచారం ప్రారంభించారు.

టీడీపీ తరపున పోటీ చేస్తున్న బొండా ఉమా కూాాడా సెంట్రల్ నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో జగన్‌పై దాడి తర్వాత బొండా ఉమా పేరు తెరపైకి రావడంతో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బాధ్యులపై చర్యలు తప్పవని బుధవారం హెచ్చరించారు.

బొండా ఉమా అనుచరుడైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బొండా ఉమాకు కూడా ముప్పు ఉంటుందని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ నేతలు మాత్రం టీడీపీకి చెందిన నాయకుల ప్రోద్భలంతోనే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిపై దాడిని హేళన చేసేలా వరుసగా ఆ పార్టీ నేతలు ప్రెస్‌ మీట్‌లు పెట్టారని, ఇదంతా పథకం ప్రకారం టీడీపీ నాయకులు చేసిన పనేనని ఆరోపిస్తున్నారు.

కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పోలీసులు సమర్పిస్తున్నారు. దాడి జరిగిన తీరు, అనుమానితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారాన్ని విజయవాడ పోలీసులు ఏపీ ఎన్నికల సీఈఓ మీనాకు వివరించారు. కేసు దర్యాప్తులో సాధించిన ప్రగతిని వివరించిన పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడించనున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం