CM Security: సిఎంపై దాడి తర్వాత కూడా అతీగతి లేని దర్యాప్తు...చర్చనీయాంశంగా మారిన ఏపీ పోలీసుల వైఖరి-even after the attack on the chief minister the investigation did not move forward ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Security: సిఎంపై దాడి తర్వాత కూడా అతీగతి లేని దర్యాప్తు...చర్చనీయాంశంగా మారిన ఏపీ పోలీసుల వైఖరి

CM Security: సిఎంపై దాడి తర్వాత కూడా అతీగతి లేని దర్యాప్తు...చర్చనీయాంశంగా మారిన ఏపీ పోలీసుల వైఖరి

Sarath chandra.B HT Telugu
Apr 15, 2024 06:12 AM IST

CM Security: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిపై దాడి తర్వాత ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నా, శనివారం జరిగిన ఘటన భద్రతా వైఫల్యాలను తేటతెల్లం చేసింది.

దాడిలో గాయపడిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి
దాడిలో గాయపడిన ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి

CM Security: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ Jagan రెడ్డి మీద విజయవాడలో జరిగిన దాడి  Attackఏపీ పోలీసుల పనితీరును ప్రశ్నించింది. దాడికి ముందు, తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, ఐఎస్‌డబ్ల్యూ, సాధారణ పోలీసుల మధ్య విజయవాడలో సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై దాడి 24 గంటలు దాటిపోయినా ఎలాంటి పురోగతి లేదు. దాడి చేసిందెవరో కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు.

ముఖ్యమంత్రిపై దాడి కేవలం అధికార, విపక్షాల మధ్య రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఏపీ పోలీసులు పనితీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ముఖస్తుతి కోసం హడావుడి చేయడమే తప్ప క్షేత్ర స్థాయిలో సత్తా చాటడంతో చతికిల పడటం స్పష్టమైంది.

హంగు, ఆర్భాటాలేనా....

ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అనుసరించాల్సిన కనీస స్పందన కూడా పోలీసుల నుంచి శనివారం కరువైంది. జగన్‌ కంటి పై భాగంలో దెబ్బ తగిలిన తర్వాత కూడా కొద్ది సేపు వాహనం పై భాగంలోనే ముఖ్యమంత్రి ఉండిపోయారు. ఆ సమయంలో పోలీసుల నుంచి కనిపించాల్సిన సత్వర స్పందన ఏ మాత్రం కనిపించలేదు. దాడుల్ని అడ్డుకునేందుకు అడ్డుగా పెట్టాల్సిన ఫైబర్‌ షీట్లు ఒక్కరి చేతుల్లో కూడా కనిపించలేదు.

ముఖ్యమంత్రి చుట్టూ కవచంలా ఏర్పడాల్సిన పోలీసులు తలోదిక్కు చూస్తూ, కిందకు ఒంగిపోయి సిఎం, మరింత నేరుగా దాడిచేసే వ్యక్తికి టార్గెట్ అయ్యేలా వ్యవహరించారు. దాడి తర్వాత కూడా అదే వాహనంపై ఆయన్ని ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. ఇది కూడా పలు అనుమానాలకు కారణమైంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భద్రత విషయంలో మొదటి నుంచి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఆయనకు ముప్పు ఉందనే కారణంతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రతను పెంచారు.

యూనిఫాంలతోనే పోటీ….

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు Chandrababu నాయుడుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌  NSG భద్రతలో ఉన్నారు. చంద్రబాబు భద్రతనేరుగా ఎన్‌ఎస్‌జి పర్యవేక్షణలో ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లిన ఎన్‌ఎస్‌జి కమాండోల రక్షణలో ఉంటారు. వారి తర్వాతే రాష్ట్ర పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు.

చంద్రబాబు చుట్టూ రక్షణగా బ్లాక్‌ యూనిఫాంలలో కమాండోలు ఉండటంతో కొన్నేళ్ల క్రితం ఏపీ సిఎం Jagan రక్షణ కోసం అదే తరహా యూనిఫాంలతో సిఎం సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఏర్పాటు చేసిన కమాండోలతో ప్రత్యేకంగా వీడియో షూట్‌లు కూడా రిలీజ్‌ చేసి పోలీసులు తెగ ప్రచారం చేశారు. యూనిఫాంల మీద పెట్టిన శ్రద్ధలో పదో వంతు కూడా ముఖ్యమంత్రి భద్రత మీద పెట్టలేదని జగన్‌పై జరిగిన దాడితో అర్థమైంది.

ఐదేళ్లుగా ముఖ్యమంత్రిని ఇంటికి పరిమితం చేయడం, ప్రజలతో కలవడంపై ఆంక్షలు విధించడం, సిఎం పర్యటనల్లో చెట్లు నరికివేయడం, రోడ్లకు అడ్డంగా పరదాలు కట్టడం... మొత్తంగా భద్రత పేరుతో మితిమీరిన చర్యలు తప్ప ముఖ్యమంత్రిని సురక్షితంగా ఉంచడం ఎలా దానిపై శ్రద్ధ పెట్టినట్టు కనిపించదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తలకు గాయమైన తర్వాత వాహనం మీద గాయంతోనే సిఎం జగన్ చాలా సేపు పర్యటించారు. అజిత్‌ సింగ్ నగర్‌ నుంచి కేసరపల్లి వరకు ప్రయాణించారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. దాడి తర్వాత పర్యటించడంపై ముఖ్యమంత్రిని వారించాల్సి ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు.

24గంటలైనా తేలలేదు...

ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. రాయి విసిరారని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్యాట్‌ బాల్‌తో కొట్టారని, ఆ తర్వాత ఎయిర్‌ గన్‌తో దాడి చేశారని రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. అయితే దెబ్బ దేనివల్ల తగిలి ఉంటుందనే దానిపై మాత్రం పోలీసులు ఇప్పటికీ మౌనం వహిస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రశాంతంగానే బస్సు యాత్ర...

ముఖ్యమంత్రి మేమంతా సిద్దం పేరుతో ప్రారంభించిన బస్సు యాత్ర రాయలసీమ జిల్లాల నుంచి గుంటూరు వరకు ప్రశాంతంగానే జరిగింది. ఎక్కడా ఎలాంటి అలజడి జరగలేదు. మధ్యలో ముఖ్యమంత్రి స్వయంగా యాత్రకు విరమణ ఇస్తే తప్ప అన్ని జిల్లాల్లో సజావుగానే యాత్ర సాగింది.

విజయవాడలోకి ప్రవేశించగానే దాడి జరగడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోయాత్ర శనివారం సాయంత్రం యాత్ర జరిగే సమయానికి సిఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గాల్లో విద్యుత్ తీగలు తగలకుండా సరఫరా నిలిపివేశారు.

చీకట్లోనే సిఎం యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. ఇదే దాడి చేసే వారికి సిఎం సులభంగా టార్గెట్ అయ్యేలా చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఆదివారం విరామం తీసుకున్న తర్వాత 15వ రోజు బస్సు యాత్రను సోమవారం కొనసాగించనున్నారు. దాడి నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిపై దాడి కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం