TDP Manifesto: అధికారంలోకి వస్తే అన్నీ డబుల్… మధ్య తరగతి ఓటర్లకి దక్కని భరోసా… ఓటు బ్యాంకులే లక్ష్యం-if it comes to power everything is double the middle class voters are not getting assurance ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Manifesto: అధికారంలోకి వస్తే అన్నీ డబుల్… మధ్య తరగతి ఓటర్లకి దక్కని భరోసా… ఓటు బ్యాంకులే లక్ష్యం

TDP Manifesto: అధికారంలోకి వస్తే అన్నీ డబుల్… మధ్య తరగతి ఓటర్లకి దక్కని భరోసా… ఓటు బ్యాంకులే లక్ష్యం

Sarath chandra.B HT Telugu
May 01, 2024 11:11 AM IST

TDP Manifesto: అధికారంలోకి వస్తే వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం, నగదు బదిలీ పథకాలు హామీలుగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మ్యానిఫెస్టో విడుదలైంది. వైసీపీ బాటలోనే టీడీపీ మ్యానిఫెస్టో కూడా సాగడంతో మధ్య తరగతి ఓటర్లు పెదవి విరుస్తున్నారు.

టీడీపీ హామీలపై జగన్‌ విమర్శలు
టీడీపీ హామీలపై జగన్‌ విమర్శలు

TDP Manifesto: నిన్న మొన్నటి వరకు ఉచితం అనుచితం, ఆర్ధిక భారం, ప్రజలపై పన్నులు అంటూ YCPని విమర్శించిన TDP టీడీపీ, Janasena జనసేనలు ఎన్నికల మ్యానిఫెస్టోలో అవే బాటలో సాగాయి.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో దాదాపు రెండులక్షల 60వేల కోట్ల రుపాయల్ని ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా లబ్దిదారులకు పంచిపెట్టామని ముఖ్యమంత్రి జగన్ YS Jagan పదేపదే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలను రానున్న ఐదేళ్లు కొనసాగిస్తామని, చివర్లో పెన్షన్ మరో రూ.500 పెంచుతామని ప్రకటించారు.

బుధవారం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోను కూటమి నేతలు ఆవిష్కరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో నగదు పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. గత ఐదేళ్లలో రూ.13లక్షల కోట్ల రుపాయల అప్పులు చేశారని జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు Chandrababu విమర్శించారు.

అదే సమయంలో రానున్న ఐదేళ్లలో వైసీపీకి మించిన నగదు బదిలీ పథకాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సంయుక్తంగా విడుదల చేశారు. 20లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ.3వేల నెలవారీ భృతి, రైతులకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం, ప్రతి మహిళకు ఏడాదికి రూ.18వేలు, విద్యార్ధులకు ఏడాదికి రూ.15వేలు, ప్రతి ఇంటికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఇచ్చారు.

వైసీపీ హయంలో ధరలు పెరుగదలతో పాటు , పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై ఐదేళ్లలో రూ.8 లక్షల భారం మోపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చినట్లే ఇచ్చి వంద రూపాయిలు కొట్టేస్తున్నారని చెప్పారు. పొద్దున పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి.. సాయంత్రం సారా కింద ఈ ప్రభుత్వం పట్టుకెళ్తోందని ఆరోపించారు.

మరోవైపు రాష్ట్రంలో తప్పనిసరిగా అమలవుతున్న సంక్షేమ పథకాలను కొనసాగించడానికి ఏటా రూ.30వేల కోట్ల రుపాయలు ఖర్చవుతోందని, చంద్రబాబు హామీలను అమలు చేయాలంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ ఆరోపిస్తున్నారు.

మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా సముద్రంలో వేట నిషిద్ధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం, చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు, అన్ని జోన్లలో రూ.1.50లకే యూనిట్ విద్యుత్ అందించడంతో పాటు సబ్సీడీలపై ట్రాన్స్ ఫార్మర్లు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎయిడెడ్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ మళ్లీ ప్రవేశపెడతామని కాలేజీలకు ఫీజులు చెల్లించి విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

మధ్య తరగతి ఓటర్లకు దక్కని ప్రాధాన్యం…

ఏపీలో వైసీపీ, టీడీపీ కూటమి మ్యానిఫెస్టోలో మధ్య తరగతి ఓటర్లకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటనలేవి లేదు. రాష్ట్రంలో 90శాతం ప్రజలకు సంక్షేమ పథకాలను అందుతున్నాయని వైసీపీ చెబుతోంది.

ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక వంటి తప్పనిసరి పథకాలు అమలు చేయడానికి ఏటా రూ.29వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని చంద్రబాబు ఇచ్చే హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.21లక్షల కోట్లు అవసరం అవుతాయని జగన్ చెబుతున్నారు.

మరోవైపు ఓటర్లను ఆకట్టుకోడానికి టీడీపీ కూడా వైసీపీకి మించిన లబ్ది కలిగిస్తామని చెబుతోంది. రెండు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి ఎలా అనే విషయాన్ని మాత్రం పూర్తిగా విస్మరించాయి. ఏపీలో మద్యం విక్రయాలకు మించిన ఆదాయ మార్గం ఏది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల స్పష్టం చేశారు. ఏటా రూ.36వేల కోట్ల రుపాయల ఆదాయాన్ని ఇచ్చే మార్గం ఖజనాకు మరొకటి లేదు. దీంతో తప్పనిసరిగా అప్పులపై ఆధారపడకుండా పథకాలను రెండు పార్టీలు కొనసాగించలేని పరిస్థితి ఉంది.

పట్టణ ప్రాంత ఓటర్లు, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులు ప్రభుత్వాల విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా వారిని ఆకట్టుకునే ప్రయత్నాలపై మాత్రం రెండు పార్టీలు దృష్టి పెట్టలేదు. సంక్షేమ పథకాల విషయంలో రకరకాల నిబంధనలు అటంకంగా మారడంతో గత ఐదేళ్లలో చాలామంది నవరత్నాలకు దూరం అయ్యారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసే లక్షలాది మంది కుటుంబాలకు పెన్షన్లు తొలగించారు.

పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ప్రధాన సమస్యగా మారినా దానిని విస్మరించాయి. టౌన్‌ ప్లానింగ్ విభాగాలు ప్రజల్ని పీడిస్తున్నా వాటిని కట్టడి చేసే చర్యలు కొరవడ్డాయి. మొత్తమ్మీద టీడీపీ మ్యానిఫెస్టోకు వైసీపీ మ్యానిఫెస్టోకు అంకెల్లో తప్ప పెద్దగా తేడా ఏమి కనిపించడం లేదనే విమర్శ కూడా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం