Congress Vs BJP : రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ- ముదురుతున్న మాటల యుద్దం
Congress Vs BJP : రిజర్వేషన్ల అంశం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెడుతుందని విమర్శిస్తుంది.
Congress Vs BJP : ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం రిజర్వేషన్ల(Reservations) చుట్టూ తిరుగుతుంది. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి తెర పైకి తెచ్చిన " దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు " అనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచి పెడుతుందని మోదీ చేసిన వ్యాఖ్యలకు......కౌంటర్ ఎటాక్ గా సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. ఈసారి మోదీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు (SC ST BC Reservations)ఎత్తేస్తుందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఈ అంశం కాంగ్రెస్ కు ప్రచార అస్త్రంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేయడానికే మోదీ(Modi) 376 సీట్లను అడుగుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపైనర్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి లేవనెత్తిన ఈ అంశం..... కాంగ్రెస్ అగ్రనేతలను ఆకర్షించడంతో వారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పాంచ్ న్యాయ్ పేరిట కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో(Manifesto)ను సైతం పక్కకు పెట్టి.... ఈ అంశాన్ని ప్రచార ఆస్త్రంగా వాడుతున్నారు.
కాంగ్రెస్ సోషల్ మీడియాకు దిల్లీ పోలీసులు నోటీసులు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) బీజేపీ ఓట్లకు భారీగా గండి పడే అవకాశం ఉందని...అప్రమత్తమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు తిరిగి గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు విఫలం అయ్యారని అందుకే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్(Congress) కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఓ అంచనాకు వచ్చారు. దీంతో రాష్ట్ర బీజేపీ(T BJP) నేతలకు అమిత్ షా క్లాస్ ఇచ్చినట్టుగా సమాచారం. నష్టనివారణ చర్యల్లో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారని, ఒరిజినల్ వీడియో వేరని ఓ వీడియోను బయటపెట్టారు. దీంతో సోమవారం సాయంత్రం దిల్లీ పోలీసులు హైదరాబాద్(Hyderabad) లోని గాంధీ భవన్ కు చేరుకుని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి సీఆర్పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు. మే 1న దిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. కాగా దీనిపై పీసీసీ లీగల్ సెల్ ఇన్ ఛార్జ్ రామచంద్రా రెడ్డి స్పందించారు. వివరణ ఇచ్చేందుకు 15 రోజుల సమయం కావాలని కోరినట్టు ఆయన వెల్లడించారు.
రిజర్వేషన్ల రద్దుపై రేవంత్ ప్రమాణానికి సిద్ధామా? : బండి సంజయ్
కేంద్రంలో మళ్లీ బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు అని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేటీఆర్(KTR) వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) తప్పు బట్టారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు పార్టీలు కుమ్మక్కై ఒకే స్వరాన్ని వినిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. బీజేపీ యథావిథంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయంపై తాను ప్రమాణనికి సిద్ధంగా ఉన్నానని, సీఎం రేవంత్ ప్రమాణానికి సిద్దంగా ఉన్నారా? అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం