AP TS Election Notification: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్.. హోరెత్తనున్న ప్రచారం-election notification for andhra telangana states from tomorrow ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ts Election Notification: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్.. హోరెత్తనున్న ప్రచారం

AP TS Election Notification: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్.. హోరెత్తనున్న ప్రచారం

Sarath chandra.B HT Telugu
Apr 17, 2024 07:45 AM IST

AP TS Election Notification: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఏపీ తెలంగాణల్లో రేపే ఎన్నికల నోటిఫికేషన్
ఏపీ తెలంగాణల్లో రేపే ఎన్నికల నోటిఫికేషన్

AP TS Election Notification: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం గురువారం ప్రారంభం కానుంది. దేశ వ్యాప్త సాధారణ ఎన్నికల్లో భాగంగా నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ Notification గురువారం విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కానుంది.

ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్‌ APతో పాటు తెలంగాణ Telanganaలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. గత నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం గురువారం నుంచి మొదలవుతుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరిస్తారు.

అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు అందరూ సిద్దం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి CEO AP ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించడంతో పాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సూచించారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీతో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 25వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29 వరకు గడువు ఉంది. పోలింగ్‌ మే 13న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న నిర్వహిస్తారు.

ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ జారీతో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు అందరూ సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.

ఓటర్ల గుర్తింపుకార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లో, పోస్టాఫీసుల్లో పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఎపిక్‌ కార్డుల పంపిణీపై మే 4న ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుందని, ఆలోపే పెండింగ్‌లో ఉన్న కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఈసీ సీఈఓ ఆదేశించారు.

సీ-విజిల్‌‌కు వచ్చే ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో డీఈవోలు అందరూ పరిష్కరిస్తున్నారని అభినందించారు. కౌంటింగ్‌ పరిశీలకుల నియామకంలో మార్గదర్శకాలు పాటించాలని, అదనంగా కావలసిన పరిశీలకులు, ఏఆర్‌వోల ప్రతిపాదనలు సాధ్యమైనంత త్వరగా సీఈఓ ఏపీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.

ఆ జిల్లాల్లో వెనుకబాటు…

ఓటరు కార్డుల పంపిణీలో కోనసీమ, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఆయా జిల్లాలు కూడా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సీఈఓ సూచించారు. సామాన్య ప్రజలను ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేయొద్దని వార్నింగ్…

ఎన్నికల షెడ్యూలు ప్రకటించనప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విదంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించొద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబందిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖల ఆద్వర్యంలో పనిచేసే సంబందిత అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎవరు కూడా స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విదంగా ఎటు వంటి కార్యక్రమాలను నిర్వహించ కూడదని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని వివరణ ఇచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం