World Cup Winning Captains: వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లందరికీ సన్మానం.. పాకిస్థాన్ మాజీ ప్రధానికి మాత్రం..-world cup winning captains to be honoured during world cup 2023 final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup Winning Captains: వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లందరికీ సన్మానం.. పాకిస్థాన్ మాజీ ప్రధానికి మాత్రం..

World Cup Winning Captains: వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లందరికీ సన్మానం.. పాకిస్థాన్ మాజీ ప్రధానికి మాత్రం..

Hari Prasad S HT Telugu

World Cup Winning Captains: వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లందరినీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సన్మానించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఈ గౌరవం పొందలేకపోతున్నాడు.

టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్మెస్ ధోనీ

World Cup Winning Captains: వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇప్పటి వరకూ వన్డే వరల్ కప్ గెలిచిన కెప్టెన్లందరినీ ఐసీసీ అహ్మదాబాద్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ సందర్భంగాఈ కెప్టెన్లందరికీ ప్రత్యేక బ్లేజర్లను అందించనున్నారు. ఆదివారం (నవంబర్ 19) ఉదయం ఈ బ్లేజర్లను అందుకునే మాజీ కెప్టెన్లు.. మధ్యాహ్నం మ్యాచ్ కు వాటితోనే స్టేడియానికి హాజరు కానున్నారు.

1975లో జరిగిన తొలి వరల్డ్ కప్ గెలిచిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ నుంచి 2019లో వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వరకూ అందరూ రానున్నారు. ఈ ఇద్దరితోపాటు కపిల్ దేవ్, అలెన్ బోర్డర్, అర్జున రణతుంగ, స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఎమ్మెస్ ధోనీ, మైఖేల్ క్లార్క్ ఈ ఫైనల్ చూడటానికి రానున్నారు.

1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రస్తుతం జైల్లో ఉన్న కారణంగా ఈ గౌరవం అందుకోలేకపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఆ కెప్టెన్లను సన్మానిస్తారు. దీంతోపాటు అదే సమయంలో మ్యూజికల్ పర్ఫార్మెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రీతమ్ లాంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్ పర్ఫామ్ చేయనున్నారు.

ఈ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ తోపాటు 500 మంది డ్యాన్సర్లు తమ డ్యాన్స్ తో సుమారు లక్ష మంది ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్ రెండో డ్రింక్స్ బ్రేక్ సందర్భంగా ప్రత్యేకంగా లైట్, లేజర్ షో ఏర్పాటు చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతను అనౌన్స్ చేస్తూ ఆకాశంలో ఛాంపియన్స్ బోర్డ్ ప్రదర్శించనున్నారు. ఇలా చేయనుండటం ఇదే తొలిసారి.

దీంతో ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. బుధవారం (నవంబర్ 15) న్యూజిలాండ్ ను తొలి సెమీఫైనల్లో ఓడించిన తర్వాత ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 2003 తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్లో తలపడనుండటం ఇదే తొలిసారి. ఆ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.