క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. 2023 ICC పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లో ఇది 13వ ఎడిషన్. ఐసీసీ ప్రతి నాలుగేళ్లకు ఓసారి వన్డే ఫార్మాట్ లో నిర్వహించే మెగా టోర్నీ ఇది. ఈసారి ఇండియా ఆతిథ్యమిస్తోంది. ఇది నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగాల్సి ఉన్నా.. కొవిడ్ కారణంగా ఏడాది చివరికి వాయిదా వేశారు. దీంతో అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగుతోంది. 2019 డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో సహా 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. 1987, 1996, 2011లలో భారత ఉపఖండంలోని ఇతర దేశాలతో కలిసి టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్యం ఇచ్చిన ఇండియా పూర్తిగా సొంతంగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. నవంబర్ 19, 2023న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ఈ ఎడిషన్ ట్యాగ్‌లైన్ "It Takes One Day". 2011లో చివరిసారి ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ను ఇండియా గెలవగా.. మరోసారి స్వదేశంలో జరగబోతున్న ఈ టోర్నీ గెలవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ను జూన్ 27న ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ టోర్నీలో మెగా మ్యాచ్ ఇండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరుగుతుందని మొదట ప్రకటించినా.. తర్వాత దీనిని అక్టోబర్ 14నే నిర్వహించానున్నారు. అక్టోబర్ 15న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో మొదట పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివాదాస్పదంగా టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. జూన్ 2023లో ఆసియా క్రికెట్ కౌన్సిల్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఆసియాకప్ క్రికెట్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలలో జరుగుతున్నాయి. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే.. గత ప్రపంచకప్ మాదిరిగానే ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటాయి. ICC క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్ ద్వారా వరల్డ్ కప్ కు జట్లు అర్హత సాధిస్తాయి. ఇందులో నుంచి 8 టీమ్స్ నేరుగా క్వాలిఫై అవుతాయి. సూపర్ లీగ్‌లోని మొత్తం 13 జట్లలో టాప్ 8కు ఈ అర్హత ఉంటుంది. ఆతిథ్య ఇండియా ఆరో స్థానంలో నిలిచింది వరల్డ్ కప్ లో అడుగుపెడుతోంది. నిజానికి ఆతిథ్య దేశం కావడంతో ఇండియా ఆటోమేటిగ్గా అర్హత సాధిస్తుంది. 8 జట్లు నేరుగా క్వాలిఫై అవడంతో మిగిలిన రెండు స్థానాల కోసం క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నిర్వహించారు. నెదర్లాండ్స్, శ్రీలంక టీమ్స్ దీని ద్వారా అర్హత సాధించాయి. రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ క్వాలిఫయర్స్ లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు లేకుండా జరుగుతున్న తొలి వరల్డ్ కప్ ఇదే.
ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న జింబాబ్వే, ఐర్లాండ్ కూడా అర్హత సాధించలేకపోయాయి. క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న నాలుగు పూర్తిస్థాయి సభ్యులలో మూడు అర్హత సాధించలేదు. శ్రీలంక మాత్రమే వరల్డ్ కప్ లో అడుగుపెట్టింది. స్కాట్లాండ్ పై గెలిచిన నెదర్లాండ్స్ వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. ఇక ఈ వరల్డ్ కప్ మొత్తం 10 వేదికల్లో జరగనుంది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. దీంతో ఈ పది వేదికల్లో స్టేడియాల అభివృద్ధి కోసం బీసీసీఐ భారీగా నిధులు వెచ్చించింది. ఈ పది వేదికల్లో ఇండియన్ టీమ్ 9 వేదికల్లో ఆడనుంది. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఇండియా మ్యాచ్ ఏదీ లేదు. ఇక హైదరాబాద్ లో మూడు లీగ్ మ్యాచ్ లు జరగడంతోపాటు టోర్నీకి ముందు వాపమ్ మ్యాచ్ లను కూడా కేటాయించారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ వామప్ మ్యాచ్ లు జరుగుతాయి. హైదరాబాద్ తోపాటు తిరువనంతపురం, గువాహటిల్లోనూ వామప్ మ్యాచ్ లు ఉంటాయి.