Virat Kohli: చాలా అలసిపోయాను.. 15 ఏళ్లలో తొలిసారి ఇలా..: విరాట్ కోహ్లి
Virat Kohli: చాలా అలసిపోయాను.. 15 ఏళ్లలో తొలిసారి ఇలా జరుగుతోంది అని విరాట్ కోహ్లి అనడం విశేషం. పాకిస్థాన్ తో మ్యాచ్ లో సెంచరీ చేసిన కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే సమయంలో ఈ కామెంట్స్ చేశాడు.
Virat Kohli: విరాట్ కోహ్లి అలసిపోయాడు. జట్టులో అందరి కంటే ఫిట్ గా ఉండే ప్లేయర్, 35 ఏళ్ల వయసులోనూ వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే స్టార్ క్రికెటర్.. తాను అలసిపోయినట్లు పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత చెప్పాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైన తర్వాత తనను ఇంటర్వ్యూ చేయడానికి మంజ్రేకర్ పిలవడంతో కోహ్లి ఈ విషయం చెప్పాడు.
"ఇంటర్వ్యూని త్వరగా ముగించండి. నేను చాలా అలసిపోయాను" అని విరాట్ కోహ్లి ముందుగానే సంజయ్ మంజ్రేకర్ ను అడగడం గమనార్హం. ఈ మ్యాచ్ లో వన్డేల్లో తన 47వ సెంచరీ చేసిన కోహ్లి.. వికెట్ల మధ్య చాలా పరుగెత్తాడు. అతడు చేసిన 122 పరుగుల్లో బౌండరీల రూపంలో కేవలం 54 రన్స్ రాగా.. మిగిలిన పరుగులన్నీ వికెట్ల మధ్య పరుగెత్తినవే.
పైగా కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీలంకతో మ్యాచ్ ఉండటంతో కోహ్లి నోటి నుంచి అలసిపోయానన్న మాట వినిపించింది. తన 15 ఏళ్ల కెరీర్లో తొలిసారి ఇలా ఓ వన్డే మ్యాచ్ ఆడిన కొన్ని గంటల్లోనే మరో మ్యాచ్ ఆడాల్సి వస్తోందని విరాట్ చెప్పాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లోనే విరాట్ వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రికార్డు క్రియేట్ చేశాడు.
"నా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఇలాంటిది తొలిసారి చూస్తున్నాను. అదృవశాత్తూ మేము టెస్ట్ ప్లేయర్స్. అందువల్ల మరుసటి రోజు వచ్చి ఎలా ఆడాలో మాకు తెలుసు. కోలుకోవడం చాలా ముఖ్యం. ఇవాళ చాలా ఉక్కపోతగా ఉంది. ఈ నవంబర్ లో నాకు 35 ఏళ్లు నిండుతాయి. అందువల్ల రికవరీ గురించి నేను జాగ్రత్తగా ఉండాలి" అని కోహ్లి అన్నాడు.
అలాంటి షాట్లు ఆడను కానీ..
ఇక పాకిస్థాన్ తో మ్యాచ్ చివరి ఓవర్లో విరాట్ కోహ్లి కొట్టిన షాట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 క్రికెట్ లోకి యువ ప్లేయర్స్ వచ్చిన తర్వాత ఎన్నో వినూత్నమైన షాట్లు ఆడుతున్నా.. కోహ్లి మాత్రం సాంప్రదాయ షాట్లకే పరిమితమయ్యాడు. కానీ ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్ లో కోహ్లి వికెట్ల వెనుక రివర్స్ ర్యాంప్ షాట్ ఆడాడు. దీనిపై కూడా విరాట్ స్పందించాడు.
"నేను అప్పటికే 100 దాటాను కాబట్టి ఆ షాట్ కు కాస్త గౌరవం ఉంది. అలాంటి షాట్లు నేను ఆడను. ఆ షాట్ ఆడినప్పుడు కూడా నాకు బాగా అనిపించలేదు. నేను, కేఎల్ ఇద్దరం సాంప్రదాయ క్రికెటర్లం. మేము అలాంటి ఫ్యాన్సీ షాట్లు ప్రయత్నించం" అని కోహ్లి స్పష్టం చేశాడు.