Ind vs SL: వరుసగా మూడోరోజూ ఆడనున్న టీమిండియా.. శ్రీలంకతో ఇవాళే సూపర్ 4 మ్యాచ్.. రెడీగా ఉన్న వరుణుడు-india to play against sri lanka in asia cup super 4 match today september 12th rain may play spoilsport ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl: వరుసగా మూడోరోజూ ఆడనున్న టీమిండియా.. శ్రీలంకతో ఇవాళే సూపర్ 4 మ్యాచ్.. రెడీగా ఉన్న వరుణుడు

Ind vs SL: వరుసగా మూడోరోజూ ఆడనున్న టీమిండియా.. శ్రీలంకతో ఇవాళే సూపర్ 4 మ్యాచ్.. రెడీగా ఉన్న వరుణుడు

Hari Prasad S HT Telugu
Sep 12, 2023 08:03 AM IST

Ind vs SL: ఆసియా కప్‌లో వరుసగా మూడోరోజూ ఆడనుంది టీమిండియా. శ్రీలంకతో మంగళవారం (సెప్టెంబర్ 12) సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా వరుణుడు రెడీగా ఉన్నాడు.

ఆసియా కప్ లో వరుసగా మూడోరోజు బరిలోకి దిగుతున్న టీమిండియా
ఆసియా కప్ లో వరుసగా మూడోరోజు బరిలోకి దిగుతున్న టీమిండియా (ANI)

Ind vs SL: ఆసియా కప్ 2023 సూపర్ 4 స్టేజ్ లో భాగంగా టీమిండియా వరుసగా మూడో రోజు కూడా బరిలోకి దిగనుంది. శ్రీలంకతో మంగళవారం (సెప్టెంబర్ 12) సూపర్ 4 మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ తో మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగడంతో ఇండియన్ టీమ్ కు అసలు రెస్ట్ లేకుండా పోయింది. ఆదివారం (సెప్టెంబర్ 10) మొదలైన మ్యాచ్.. సోమవారం (సెప్టెంబర్ 11) కూడా కొనసాగిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా.. ఇక ఇప్పుడు శ్రీలంకపైనా గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. ఈ సూపర్ 4 మ్యాచ్ కూడా కొలంబోలోనే జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డుపడటం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ కు రిజర్వ్ డే ఉన్నా.. ఈ మ్యాచ్ కు లేకపోవడంతో ఒకవేళ మ్యాచ్ రద్దయితే రెండు టీమ్స్ చెరొక పాయింట్ పంచుకుంటాయి.

వరుణుడు వదిలేడా లేడు

కొలంబోలో వాతావరణం ఇప్పట్లో మెరుగయ్యేలా లేదు. ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరిగే మంగళవారం కూడా 90 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇక టాస్ సమయంలోనూ 60 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొలంబో 92 శాతం మేఘావృతమై ఉండనుంది. ఇక గాల్లో తేమ శాతం 77 శాతంగా ఉంటుంది. అంటే ఉక్కపోత కూడా అధికంగానే ఉంటుంది.

ప్రస్తుతం సూపర్ 4 పాయింట్ల టేబుల్లో ఇండియా, శ్రీలంక తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ పై రికార్డు విజయంతో ఇండియా ఏకంగా 4.520 నెట్ రన్ రేట్ తో టాప్ లో ఉండగా.. శ్రీలంక 0.42 నెట్ రన్‌రేట్ తో రెండోస్థానంలో ఉంది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక విజయం సాధించింది. స్వదేశంలో లంక జట్టును తక్కువగా అంచనా వేయలేం.

ఇక్కడి కండిషన్స్ వాళ్లకు తెలిసినట్లుగా మరొకరికి తెలియదు. దీంతో టీమిండియా వీళ్లతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఇండియా ఫైనల్ చేరినట్లే. ఒకవేళ మ్యాచ్ రద్దయినా ఇండియాకు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఈ మ్యాచ్ రద్దవడం పాకిస్థాన్ కు చేటు చేస్తుంది. శ్రీలంకపై ఇండియా గెలవాలని ప్రస్తుతం పాక్ టీమ్ ప్రార్థిస్తోంది.

Whats_app_banner