Suryakumar catch: టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన క్యాచ్ ఇదే.. సూర్యకుమార్ చేసిన అద్భుతం-this surya kumar catch changed the t20 world cup final team india win world cup ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Catch: టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన క్యాచ్ ఇదే.. సూర్యకుమార్ చేసిన అద్భుతం

Suryakumar catch: టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన క్యాచ్ ఇదే.. సూర్యకుమార్ చేసిన అద్భుతం

Hari Prasad S HT Telugu
Jun 30, 2024 08:59 AM IST

Suryakumar catch: టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలవడంతో సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ కళ్లు చెదిరే క్యాచ్ కీలకపాత్ర పోషించింది. చివరి ఓవర్ తొలి బంతికే డేవిడ్ మిల్లర్ క్యాచ్ ను బౌండరీ దగ్గర అతడు అందుకున్నాడు.

టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన క్యాచ్ ఇదే.. సూర్యకుమార్ చేసిన అద్భుతం
టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన క్యాచ్ ఇదే.. సూర్యకుమార్ చేసిన అద్భుతం (Agency/Screengrab)

Suryakumar catch: టీమిండియా మరో టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న 17 ఏళ్ల అభిమానుల ఆకాంక్షలు ఫలించాయి. 11 ఏళ్ల తర్వాత ఇండియన్ టీమ్ మరో ఐసీసీ ట్రోఫీ గెలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మొత్తానికి తాను అనుకున్నది సాధించారు. అయితే ఇవన్నీ ఆ ఒక్క క్యాచ్ తో సాధ్యమయ్యాయి. ఫైనల్లో బ్యాట్ తో దారుణంగా విఫలమైనా.. చివరి ఓవర్లో సూర్య పట్టిన క్యాచ్ మాత్రం మ్యాచ్ ను మలుపు తిప్పింది.

సూర్య క్యాచ్.. ఫైనల్‌కే హైలైట్..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా గెలవాలంటే.. 6 బంతుల్లో 16 రన్స్ చేయాలి. ఎంతో ఒత్తిడి. క్రీజులో డేవిడ్ మిల్లర్ లాంటి మంచి హిట్టర్ ఉన్నాడు. ఈ దశలో ఇండియన్ ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అయితే హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ తొలి బంతికే ఓ అద్భుతం జరిగింది. ఆ బంతిని లాంగాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి ఔటయ్యాడు మిల్లర్.

కానీ అంత ఒత్తిడిలోనూ బౌండరీ దగ్గర సూర్యకుమార్ ఏమాత్రం తడబడకుండా కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సిక్స్ వెళ్తుందనుకున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. తన బ్యాలెన్స్ ఔట్ కావడంతో గాల్లోకి బంతిని వేసి మళ్లీ బౌండరీలోపలికి వచ్చి క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో మిల్లర్ ఔటయ్యాడు. మ్యాచ్ భారత్ వైపు వచ్చేసింది.

ఒకవేళ సూర్యకుమార్ ఈ క్యాచ్ పట్టి ఉండకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మ్యాచ్ లను అద్భుతంగా ముగిస్తాడని పేరున్న మిల్లర్.. సౌతాఫ్రికాను గెలిపించే వాడే. కానీ హార్దిక్, సూర్య జోడీ తొలిసారి కప్పు గెలవాలన్న సఫారీల ఆశలపై నీళ్లు పోశారు. కోట్లాది మంది భారతీయులు గర్వంతో ఉప్పొంగేలా చేశారు. అంత ఒత్తిడిలో సూర్య ఏమాత్రం అదుపు తప్పకుండా ఆ క్యాచ్ పట్టడం మాత్రం నిజంగా క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అనడంలో సందేహం లేదు.

ఆ క్యాచ్ సరైనదేనా?

అయితే సూర్యకుమార్ పట్టిన క్యాచ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో బంతి అతని చేతుల్లో ఉన్నప్పుడు కాలు బౌండరీ లైన్ కు తగిలినట్లు కొన్ని రీప్లేల్లో కనిపించింది. అయినా అంపైర్ ఇండియాకు ఫేవర్ చేశాడంటూ పలువురు ఈ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై సౌతాఫ్రికా టీమ్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. మరి ఈ క్యాచ్ పై భవిష్యత్తులో ఆ టీమ్ ఐసీసీ దగ్గరికి వెళ్తుందా అన్నది చూడాలి.

అయితే సూర్య పట్టిన ఈ క్యాచ్ మాత్రం 2007 టీ20 వరల్డ్ కప్ చివరి ఓవర్లో పాకిస్థాన్ ప్లేయర్ మిస్బా ఇచ్చిన క్యాచ్ ను శ్రీశాంత్ పట్టుకున్న క్యాచ్ లాగే అనిపించింది. ఆ క్యాచ్ ఇండియా తొలి టీ20 వరల్డ్ కప్ అందించగా.. ఈ క్యాచ్ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరో వరల్డ్ కప్ అందించింది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయిన అపవాదును కూడా ఈ విజయంతో టీమిండియా చెరిపేసింది. హ్యాట్సాఫ్ టీమిండియా.

Whats_app_banner