Team India Bowling Coach: టీమిండియా బౌలింగ్ కోచ్ అతడే.. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి రానున్న సౌతాఫ్రికా మాజీ బౌలర్
Team India Bowling Coach: టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్ వచ్చేశాడు. హెడ్ కోచ్ గంభీర్ కోరినట్లే సౌతాఫ్రికా మాజీ బౌలర్ కు అవకాశం ఇచ్చినట్లు క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో అతని జర్నీ మొదలు కానుంది.
Team India Bowling Coach: టీమిండియా బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్ కు అవకాశం ఇచ్చినట్లు క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది. బీసీసీఐ కార్యదర్శి జై షానే ఈ విషయం వెల్లడించినట్లు ఆ రిపోర్టు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి మోర్కెల్ కాంట్రాక్టు ప్రారంభం కానున్నట్లు కూడా వెల్లడించడం గమనార్హం.
టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్
టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చేస్తున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేసినట్లు సౌతాఫ్రికా మాజీ పేస్ బౌలర్ మోర్నీ మోర్కెల్ కు బీసీసీఐ ఆ బాధ్యతలు అప్పగించింది. సెప్టెంబర్ 1 నుంచి అతడు రానుండగా.. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ తోనే మోర్కెల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
మోర్కెల్ కెరీర్ ఇలా..
మోర్నీ మోర్కెల్ కు సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ ఉంది. అతడు సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. వీటిలో వరుసగా 309, 188, 47 వికెట్లు తీసుకున్నాడు. అతడు ఆడే సమయంలో సౌతాఫ్రికా జట్టులో డేల్ స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్ లాంటి బౌలర్లు కూడా ఉన్నారు. ఈ పేస్ త్రయం ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేది.
33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు కౌంటీ క్రికెట్ ఆడిన మోర్కెల్.. తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టడం ప్రారంభించాడు. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ గా అతని అంతర్జాతీయ కోచింగ్ కెరీర్ మొదలైంది. ఆ జట్టులోని స్టార్ పేసర్లు షహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షాలను మోర్కెల్ రాటుదేల్చాడు. అయితే గతేడాది వన్డే వరల్డ్ కప్ లో పాక్ టీమ్ వైఫల్యం తర్వాత మోర్కెల్ తప్పుకున్నాడు.
గంభీర్, మోర్కెల్ కాంబో ఇలా..
టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చినప్పటి నుంచీ అతడు బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ కు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. దీనికి ఓ బలమైన కారణమే ఉంది. ఈ ఇద్దరూ ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మూడు సీజన్లపాటు కలిసి ఆడారు. ఆ తర్వాత లక్నోసూపర్ జెయింట్స్ కు గంభీర్ మెంటార్ గా ఉండగా.. మోర్కెల్ బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.
ఈ సీజన్లో గంభీర్ కేకేఆర్ కు వెళ్లిపోయిన తర్వాత కూడా మోర్కెల్ లక్నోతోనే కొనసాగాడు. ఇక ఇప్పుడు అతడు ఇండియన్ టీమ్ లో అసిస్టెంట్ కోచ్ లుగా ఉన్న అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డూషె, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ లతో కలవనున్నాడు. ద్రవిడ్ అండ్ కో వెళ్లిపోయిన తర్వాత బంగ్లాదేశ్ తో సిరీస్ లో టీమిండియా మరోసారి పూర్తిస్థాయి సపోర్టింగ్ స్టాఫ్ తో బరిలోకి దిగనుంది.