Team India: ఇండియన్ బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారు.. వాటిని చెక్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Team India: ఇండియన్ బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారు.. వాటిని చెక్ చేయాలి అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. మిగతా బౌలర్లకు లభించని స్వింగ్ వాళ్లకు ఎలా దక్కుతోందని అతడు ప్రశ్నించాడు.
Team India: వరల్డ్ కప్ 2023లో టీమిండియా పేసర్ల జోరు చూసి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ, బీసీసీఐ వాళ్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, వాటిని కచ్చితంగా చెక్ చేయాలని ఓ టీవీ ఛానెల్ చర్చలో అనడం గమనార్హం. 1996 నుంచి 2005 మధ్య పాకిస్థాన్ టీమ్ తరఫున 7 టెస్టులు, 16 వన్డేలు ఆడిన రజా.. ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం షాక్ కు గురి చేస్తోంది.
వరల్డ్ కప్ లో ప్రపంచ అత్యుత్తమ పేస్ బౌలర్లు కూడా తేలిపోతున్న వేళ.. ఇండియన్ పేస్ బౌలర్లు చెలరేగుతున్నారని, వాళ్లకు ఇతర బాల్స్ ఏమైనా ఇస్తున్నారంటారా అని టీవీ ఛానెల్ యాంకర్ ప్రశ్నించాడు. దీనికి నిజమే అంటూ రజా అన్నాడు. పాకిస్థాన్ ఛానెల్ ఏబీఎన్ న్యూస్ లో అతడు మాట్లాడాడు. ఇండియన్ బౌలర్లు మాత్రం ఏదో బౌలింగ్ వికెట్ పై ఆడుతున్నట్లుగా అనిపిస్తోందని సదరు యాంకర్ అభిప్రాయపడ్డాడు.
దీనిపై రజా స్పందిస్తూ.. "సెకండ్ ఇన్నింగ్స్ లో బహుషా బాల్ కూడా మారిపోతున్నట్లుంది. ఐసీసీ ఇస్తుందా లేక అంపైర్ ప్యానెల్ ఇస్తోందా లేక బీసీసీఐ ఇస్తోందా తెలియదు కానీ.. వాళ్లకు ఇస్తున్న బాల్ ను చెక్ చేయాలి" అని అనడం విశేషం. ఇండియా బౌలింగ్ కు రాగానే బాల్ మారిపోతోందని అన్నాడు. అంతేకాదు వరల్డ్ కప్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు కూడా కొన్ని ఇండియన్ టీమ్ కు అనుకూలంగా ఉన్నాయని హసన్ రజా అన్నాడు.
ఈ కాలంలో రెండు వైపుల నుంచి కొత్త బంతిని ఉపయోగిస్తున్నా.. ఇండియన్ బౌలర్లు షమి, సిరాజ్ అలా ఎలా స్వింగ్ చేయగలుగుతున్నారని రజా ప్రశ్నించాడు. ఈ ఇద్దరు పేసర్ల ధాటికి ప్రతి టీమ్ వణికిపోతుండగా.. శ్రీలంక అయితే మరీ 55 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాతే రజా ఇలాంటి వింత కామెంట్స్ చేశాడు. దీనిపై సీరియస్ గా చర్చ జరగాలని సదరు టీవీ ఛానెల్ యాంకర్ అనడం మరీ విడ్డూరంగా అనిపించింది.
ఈ వీడియో వైరల్ అవడంతో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. "ఇది సీరియస్ క్రికెట్ షోనేనా? ఒకవేళ కాకపోతే సెటైర్, కామెడీ అని ఇంగ్లిష్ లో ఏదో ఒక చోట చెప్పండి. ఉర్దూలో రాసే ఉంటారు. కానీ నాకు చదవడం రాదు కాబట్టి అర్థం చేసుకోలేకపోయానేమో" అని ఆకాశ్ చోప్రా ఈ చర్చపై సెటైర్ వేయడం విశేషం.
మరీ ఇంత చెత్త చర్చ జరపడం ఏంటని ప్రముఖ క్రికెట్ జర్నలిస్ట్ అయాజ్ మేనన్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కామెంట్స్ పై ఇప్పటి వరకూ ఇండియన్ టీమ్ లేదా బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనిపై ఏమైనా స్పందిస్తుందా లేదా చూడాలి.