SA20 2024: అదరగొట్టిన సన్‌రైజర్స్.. రెండోసారి టైటిల్ కైవసం.. కావ్య పాప రియాక్షన్ చూశారా?-sunrisers eastern cape win sa20 2024 trophy for second time and kavya maran reaction viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa20 2024: అదరగొట్టిన సన్‌రైజర్స్.. రెండోసారి టైటిల్ కైవసం.. కావ్య పాప రియాక్షన్ చూశారా?

SA20 2024: అదరగొట్టిన సన్‌రైజర్స్.. రెండోసారి టైటిల్ కైవసం.. కావ్య పాప రియాక్షన్ చూశారా?

Sanjiv Kumar HT Telugu
Feb 11, 2024 10:29 AM IST

Sunrisers Eastern Cape Win SA20 2024: సన్‌రైజర్స్ మరోసారి సంచలనం సృష్టించింది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌లో రెండో సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో సన్ రైజర్స్ రెండోసారి ట్రోఫీని అందుకుంది. ఈ సంతోష సమయంలో జట్టు ఓనర్ కావ్య మారన్ రియాక్షన్ వైరల్ అవుతోంది.

అదరగొట్టిన సన్‌రైజర్స్.. రెండోసారి టైటిల్ కైవసం.. కావ్య పాప రియాక్షన్ చూశారా?
అదరగొట్టిన సన్‌రైజర్స్.. రెండోసారి టైటిల్ కైవసం.. కావ్య పాప రియాక్షన్ చూశారా?

Sunrisers Eastern Cape Kavya Maran: సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన టీ20 లీగ్ రెండో సీజన్ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్ వార్‌లో టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ క్రికెట్ జట్టు. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లలో స్టబ్స్ 56 పరుగులు, అబెల్ 55 పరుగులతో హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. వారికి హెర్మెన్ 42 రన్స్, మార్‌క్రమ్ 42 రన్స్‌తో రాణించి తోడుగా నిలిచారు. ఇక డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్స్ తీయగా.. టాప్లీ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ క్రికెట్ టీమ్ 115 పరుగుల వద్దే కుప్పకూలిపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో పేసర్ మార్కో జానెసన్ 5 వికెట్లతో దుమ్ముదులిపాడు. అలా డర్బన్ సూపర్ జెయింట్స్ పతనానికి మార్కో జానెసన్ కారణం అయ్యాడు. మార్కోతోపాటు బార్ట్‌మన్, వారెల్ చెరో రెండు వికెట్లు తీశారు. డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో ముల్డర్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్ తుది పోరుల హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అబెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అలాగే టోర్నీ మొత్తంగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన హెన్రిస్ క్లాసెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కాగా గతేడాది జరిగిన మొట్టమొదటి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను కూడా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దక్కించుకుంది. రెండోసారి కూడా టైటిల్ గెలవడంతో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్ తెగ సంబరపడిపోయింది. స్టేడియంలో అరుస్తూ గోల చేసింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్రోఫీని కావ్య మారన్‌కు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రెండాసారి కప్పు గెలవడంతో తెగ ఖుషీ అయింది కావ్య పాప అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీకి చెందినదే ఈ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ క్రికెట్ టీమ్‌. అయితే, సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీకి ఇది నాలుగో టైటిల్. ఇప్పటివరకు ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (2009, 2016) రెండు టైటిళ్లు గేలవగా.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ 2 సౌతాఫ్రికా లీగ్ ట్రోఫీలు (2023, 2024) కైవసం చేసుకుంది. దీంతో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ ఖాతాలో 4 టైటిల్స్ ఉన్నాయి.

Whats_app_banner