Sourav Ganguly: వెల్‌డన్ బాయ్స్ - టీమిండియాపై గంగూలీ, గంభీర్ ప్రశంసలు
Sourav Ganguly: అండర్ 19 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియాపై సౌరభ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఫైనల్‌లో అండర్ 19 జట్టు అసమాన ఆటతీరును కనబరిచిందంటూ ట్వీట్స్ చేశారు.
Sourav Ganguly: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టిన భారత జట్టుపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం జరిగిన సెమీస్‌లో సౌతాఫ్రికాపై అండర్ 19 భారత జట్టు రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి కాగా...మొత్తంగా ఇది తొమ్మిదిసారి కావడం గమనార్హం. అండర్ 19 టీమ్‌ను బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా దిగ్గజ ఆటగాడు సౌరభ్ గంగూలీ అభినందించారు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన స్థాయి నుంచి అసమాన రీతిలో పోరాడి టీమిండియా అండర్ 19 జట్టు ఈ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిందని గంగూలీ అన్నాడు. యువజట్టు ఆటతీరు బాగుందని పేర్కొన్నాడు. సెమీస్‌లో ఓటమి పాలైనా సౌతాఫ్రికా ప్రతిభను తక్కువ చేయలేమని, ఈ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని గంగూలీ అన్నాడు. అతడి ట్వీట్ వైరల్‌గా మారింది.
ఐదోసారి ఫైనల్...
అలాగే టీమిండియా అండర్ 19 జట్టుపై గంభీర్ కూడా ప్రశంసలు కురిపించాడు. వరుసగా ఐదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టినందుకు వెల్ డన్ బాయ్స్ అంటూ ట్వీట్ చేశాడు. గంభీర్, గంగూలీతో పాటు ఇర్ఫాన్ పఠాన్, జయ్‌షాతో పాటు పలువురు క్రికెటర్లు టీమిండియా అండర్ 19 టీమ్‌పై అభినందనలు కురిపిస్తున్నారు. సచిన్ దాస్, ఉదయ్ సహరాన్‌తో పాటు రాజ్ లింబానీ రాణించి టీమిండియాకు మరచిపోలేని విజయాన్ని అందించారని జయ్ షా అన్నాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో ఓటమి లేకుండా టీమిండియా దూసుకుపోతున్నదని, ఫైనల్‌లో ఇదే జోరును కొనసాగించాలని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
రాజ్ లింబాని బౌలింగ్....
మంగళవారం జరిగిన సెమీస్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాపై టీమిండియా పోరాడి గెలిచింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిన అండర్ 19 జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 244 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రిటోరియస్ 76 పరుగులతో రాణించాడు. అతడితో పాటు సెలెట్‌స్వాన్ కూడా 64 పరుగులు చేశాడు. వీరిద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో సౌతాఫ్రికా 244 పరుగులే చేసింది. చివరలో లూస్ (12 బాల్స్‌లో 23 రన్స్), కెప్టెన్ జేమ్స్ (2 4 రన్స్)తో బ్యాట్ ఝులిపించడంతో సౌతాఫ్రికా ఈ మాత్రమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబాని మూడు, ముషీర్‌ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
సచిన్, ఉదయ్ సహరాన్...
244 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో కెప్టెన్ ఉదయ్ సహరాన్, సచిన్ దాస్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. సచిన్ దాస్ 95 బాల్స్‌లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 96 రన్స్ చేశాడు. ఉదయ్ సహరాన్ 81 పరుగులతో రాణించాడు. చివరలో వీరిద్దరు ఔట్ కావడంతో మ్యాచ్ టెన్షన్‌గా మారింది. కానీ రాజ్ లింబాని ఫోరు, సిక్సర్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు.