Hafeez on Indian Captains: గంగూలీ vs ధోనీ vs కోహ్లీ కెప్టెన్సీలను పోల్చిన హఫీజ్.. ఎవరు బెస్టో చెప్పిన పాక్ మాజీ-hafeez compares ganguly dhoni and kohli captaincies ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hafeez On Indian Captains: గంగూలీ Vs ధోనీ Vs కోహ్లీ కెప్టెన్సీలను పోల్చిన హఫీజ్.. ఎవరు బెస్టో చెప్పిన పాక్ మాజీ

Hafeez on Indian Captains: గంగూలీ vs ధోనీ vs కోహ్లీ కెప్టెన్సీలను పోల్చిన హఫీజ్.. ఎవరు బెస్టో చెప్పిన పాక్ మాజీ

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 07:33 PM IST

Hafeez on Indian Captains: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత కెప్టెన్లలో ధోనీ, గంగూలీ, కోహ్లీని పోల్చాడు. ముగ్గురిలో ఉన్న లక్షణాలను చెప్పాడు.

భారత కెప్టెన్లను పోల్చిన పాక్ మాజీ క్రికెటర్ హఫీజ్
భారత కెప్టెన్లను పోల్చిన పాక్ మాజీ క్రికెటర్ హఫీజ్

Hafeez on Indian Captains: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్.. తన 18 ఏళ్ల కెరీర్‌లో ఆ దేశం తరఫున ఎన్నో సార్లు అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అంతేకాకుండా భారత్‌లోనూ ముగ్గురు కెప్టెన్సీలకు సాక్షిగా నిలిచాడు. 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన హఫీజ్.. ప్రారంభంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీని ఆ తర్వాత 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ.. చివరగా 2021లో అతడు రిటైరయ్యే వరకు విరాట్ కోహ్లీ నేతృత్వాన్ని చూశాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారిగా ఆడిన హఫీజ్ చిరకాల ప్రత్యర్థి అయిన టీమిండియా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనేది చెప్పకపోయినప్పటికీ.. టీమిండియాను కొత్త శిఖరాలకు ధోనీ, కోహ్లీ తీసుకెళ్లారని స్పష్టం చేశాడు. గంగూలీ అందుకు పునాది వేశాడని తెలిపాడు.

"గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫౌండేషన్ కరెక్టుగా పడింది. అప్పుడే ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలమని టీమిండియా భావించింది. ఇదే సమయంలో ఇలాంటి మనస్తత్వం పాక్‌కు గతంలో ఉండేది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా దూకుడుగా ఆడగల జట్టు అప్పట్లో మాకు ఉంది. భారత్‌లో గంగూలీ కాలంలోనే ఆ ఫీల్ వచ్చింది. ధోనీ కెప్టెన్సీలో అందుకు తగినట్లుగా చక్కటి వెర్షన్ తయారైంది. ఈ భావనే ఏ సిరీస్ లేదా ఏ టోర్నీలోనైనా టీమిండియాను అత్యంత ఫేవరెట్ జట్లలో ఒకటిగా చేసింది. విరాట్ కోహ్లీ కూడా విజయాలను కొనసాగించాడు." అని హఫీజ్ అన్నాడు.

"భారత్-పాక్ మ్యాచ్‌ల్లో తనకిష్టమైన మూమెంట్ గురించి హఫీజ్ తెలియజేశాడు. ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే ప్రతి మ్యాచ్ అది ఓడినా, గెలిచినా ప్రతి మూమెంట్ చిరకాలం గుర్తుండిపోతుంది. మ్యాచ్‌లో గెలిస్తే ప్రశంసలు అలాగే వస్తాయి, ఓడితే అభిమానుల కోపం అదే స్థాయిలో ఉంటుంది. నాకు గుర్తున్న అలాంటి మ్యాచ్ ఒకటి ఉంది. 2012లో బెంగళూరు వేదికగా జరిగిన టీ20లో మేము గెలిచాం. స్టేడియంలో అంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. అలాంటి అనుభూతి మళ్లీ చెందాలనుకున్నా. ఎందుకంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడు అందులో మేము బాగా రాణిస్తే కిక్కిరిసిన స్టేడియం నిశ్శబ్దంగా మారుతుంది. అది నాకు చాలా ఇష్టం" అని హఫీజ్ తెలిపాడు.

Whats_app_banner