shubman gill:శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ షాక్ - బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం - టీమిండియాలోకి ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ?-shubman gill likely to miss t20 series against bangladesh ind vs ban first test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill:శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ షాక్ - బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం - టీమిండియాలోకి ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ?

shubman gill:శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ షాక్ - బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం - టీమిండియాలోకి ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ?

Nelki Naresh Kumar HT Telugu
Sep 15, 2024 06:41 PM IST

shubman gill: బంగ్లాదేశ్‌తో జ‌రుగ‌నున్న టీ20 సిరీస్ నుంచి శుభ్‌మ‌న్ గిల్‌ను త‌ప్పించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్ ద్వారా టీమిండియాలో ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

శుభ్‌మ‌న్ గిల్‌
శుభ్‌మ‌న్ గిల్‌

shubman gill: శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ షాకివ్వనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌తో సిరీస్ మొత్తానికి గిల్‌ను దూరం పెట్టాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల కార‌ణంగా టీమిండియా స్థానం కోల్పోయిన ఇషాన్ కిష‌న్ దాదాపు ఏడాది త‌ర్వాత జ‌ట్టులోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

గిల్‌కు నో ఛాన్స్‌...

బంగ్లాదేశ్‌తో స్వ‌దేశంలో రెండు టెస్ట్‌లు, మూడు టీ20 మ్యాచ్‌ల‌ను టీమిండియా ఆడ‌నుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ సెప్టెంబ‌ర్ 19 నుంచి మొద‌లుకానుంది. ఈ ఫ‌స్ట్ టెస్ట్ కోసం భార‌త జ‌ట్టును ఇటీవ‌లే బీసీసీఐ ప్ర‌క‌టించింది. తొలి టెస్ట్‌లో శుభ్‌మ‌న్ గిల్‌కు స్థానం ద‌క్క‌లేదు. రెండో టెస్ట్‌తో పాటు టీ20 సిరీస్ స్క్వాడ్‌ను మ‌రో ఐదారు రోజుల్లో సెలెక్ట‌ర్లు ప్ర‌క‌టించ‌బోతున్నారు.

ఫామ్ లేమీ కాదు...

రెండో టెస్ట్‌తో పాటు టీ20ల నుంచి శుభ్‌మ‌న్ గిల్‌ను త‌ప్పించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. గిల్‌ను ప‌క్క‌న‌పెట్ట‌డానికి ఫామ్‌లేమి కార‌ణం కాద‌ని, విశ్రాంతినివ్వాల‌నే జ‌ట్టు నుంచి అత‌డిని త‌ప్పించ‌నున్న‌ట్లు బీసీసీఐ అధికార ప్ర‌తినిధి తెలిపాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ అక్టోబ‌ర్‌లో మొద‌లుకానుంది. అక్టోబ‌ర్ 7 నుంచి 13 వ‌ర‌కు మూడు టీ20 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో టీమిండియా త‌ర‌ప‌డ‌నుంది.

బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్ ముగిసిన మూడు రోజుల త‌ర్వాతే న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ పోరుకు టీమిండియా సిద్ధం కాబోతోంది. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కోస‌మే శుభ్‌మ‌న్ గిల్‌కు బంగ్లాదేశ్‌తో జ‌రుగ‌నున్న టీ20 మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి నివ్వ‌నున్న‌ట్లు బీసీసీఐ ప్ర‌తినిధి చెప్పారు. న్యూజిలాండ్ సిరీస్‌లో గిల్ త‌ప్ప‌కుండా బ‌రిలోకి దిగుతాడ‌ని అన్నాడు.

ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ...

దాదాపు ఏడాది గ్యాప్ త‌ర్వాత వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో అత‌డికి జ‌ట్టులో స్థానం ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ టీ20 సిరీస్‌కు రిష‌బ్ పంత్‌కు కూడా విశ్రాంతి నివ్వాల‌నే ఆలోచ‌న‌లో సెలెక్ట‌ర్లు ఉన్న‌ట్లు స‌మాచారం.

రిష‌బ్ పంత్ స్థానంలో ఇషాన్ కిష‌న్ జ‌ట్టులోకి రానున్న‌ట్లు చెబుతోన్నారు. దులీప్ ట్రోఫీలో ఇషాన్ కిష‌న్ మెరుపు బ్యాటింగ్‌తో అద‌రొట్టాడు. ఇండియా సి త‌ర‌ఫున బ‌రిలో దిగిన ఇషాన్ కిష‌న్‌...ఇండియా బి జ‌ట్టుపై 126 బాల్స్‌లోనే 114 ప‌రుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీ రాణించాడు.