Ishan Kishan Bowling: మొన్న పంత్...ఇప్పడు ఇషాన్ కిషన్ - బౌలింగ్ టాలెంట్ చూపిస్తోన్న టీమిండియా వికెట్ కీపర్లు
Ishan Kishan Bowling: ఇటీవల ప్రారంభమైన ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో బౌలింగ్ చేసి క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు టీమిండియా వికెట్ కీపర్ పంత్. తాజాగా అతడి బాటలోనే మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అడుగులు వేశాడు. బుచ్చిబాబు టోర్నీలో రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు ఇషాన్.
Ishan Kishan Bowling: టీమిండియా వికెట్ కీపర్లు తమలోని బౌలింగ్ టాలెంట్‌ను బయటపెడుతోన్నారు. ఇటీవల ప్రారంభమైన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో బౌలింగ్ చేసి క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.
లాస్ట్ ఓవర్ బౌలింగ్...
ప్రత్యర్థి జట్టు పౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ విజయానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా లాస్ట్ ఓవర్‌లో పంత్ బౌలింగ్ దిగాడు. కేవలం ఒకే ఒక బాల్ వేశాడు. ఆ బాల్‌కు ఒక్క పరుగు రావడంతో పంత్ బౌలింగ్ పూర్తి ఓవర్ చూసే అవకాశం రాలేదు.
ఇషాన్ కిషన్ కూడా...
తాజాగా రిషబ్ పంత్ బాటలో మరో వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ కూడా అడుగులు వేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నీలో జార్ఖండ్ టీమ్‌కు ఇషాన్ కిషన్ సారథిగా వ్యవహరిస్తోన్నాడు. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన ఇషాన్ కిషన్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇషాన్ కిషన్ బౌలింగ్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతోన్నాయి. కాగా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ఇప్పటివరకు ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో మాత్రం ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు.
చిత్తుగా ఓడిన ఇషాన్ టీమ్...
ఇషాన్ కిషన్ బౌలింగ్ చేసినా తన టీమ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. హైదరాబాద్ చేతిలో జార్ఖండ్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 178, సెకండ్ ఇన్నింగ్స్‌లో 140 పరుగులు మాత్రమే చేశారు. హైదరాబాద్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 26 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది.
ఇషాన్ తుస్...
బుచ్చిబాబు టోర్నీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తుఫాన్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్‌లో మాత్రం తుస్ మనిపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్రీజులో నిలదొక్కుకున్నట్లే కనిపించాడు. చెత్త షాట్ ఆడి కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు.
ఏడాదిపైనే...
ఇషాన్ కిషన్ టీమిండియాకు దూరమై ఏడాది అవుతోంది. చివరగా గత ఏడాది అక్టోబర్‌లో వన్డే మ్యాచ్, నవంబర్‌లో టీ20 మ్యాచ్ ఆడాడు. దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. తిరిగి టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తోన్నాడు.
కాగా ఇప్పటివరకు ఇషాన్ కిషన్ టీమిండియా తరఫున 32 టీ20లు, 27 వన్డేలతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 2024 ఐపీఎల్‌లో 14 మ్యాచుల్లో 320 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను వదులుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి