Supreme Court On NEET Row : నీట్ యూజీ పేపర్ లీకైంది నిజమే.. అప్పుడే రీ టెస్ట్‌కు ఆదేశిస్తాం
NEET UG 2024 Question Paper Leak : నీట్ యూజీని మళ్లీ నిర్వహించడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ జూలై 11, 2024న జరగనుంది.
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని పేర్కొంది. పేపర్ లీక్ కావడం వాస్తవం అని, తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. NEET UG వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది. ప్రశ్నాపత్రాల లీక్ మొదటిసారి ఎప్పుడు జరిగిందని నివేదిక ఇవ్వాలని ఎన్టీఏను ఆదేశించింది.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా దర్యాప్తు స్థితిని సూచిస్తూ సీబీఐ దర్యాప్తు అధికారి స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సైబర్ ఫోరెన్సిక్స్ యూనిట్‌లో లేదా ఏదైనా నిపుణుల ఏజెన్సీలో డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించడం సాధ్యమేనా అని కేంద్రం, ఎన్‌టీఏను ప్రశ్నించింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో 38 పిటిషన్లు దాఖలు అయ్యాయి. జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేసింది.
పరీక్ష విధానాన్ని దెబ్బతీశారని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా నీట్ రీ టెస్ట్‌కు ఆదేశిస్తామని కోర్టు స్పష్టం చేసింది. లీకైన పేపర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతామని తెలిపింది. అయితే దీనికంటే ముందుగా.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తెలియాల్సి ఉందని ధర్మాసన పేర్కొంది.
పేపర్ లీకేజీ విషయంలో ఇద్దరికే సంబంధం ఉందని అంటున్నారని.. కానీ ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం అని కోర్టు చెప్పింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? ఎలా చేరిందో తెలుసా? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై చర్యలు ఏం తీసుకున్నారు? ఎందరి ఫలితాలు ఆపేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలని కోర్టు ఆదేశించిది. సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పింది. అన్నీ పరిశీలించాకనే తీర్పు చెబుతామని ధర్మాసనం వెల్లడించింది.
నీట్ వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో తెలుపుతూ.. నివేదిక ఇవ్వాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రం ఎప్పుడు లీకైందన్న విషయం చెప్పాలని ఎన్టీఏకు తెలిపింది.
ఈ సంవత్సరం మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు రావడంతో ఆందోళన ఎక్కువైంది. జూన్ 4న ఫలితాల ప్రకటన తర్వాత నిరసన ఎక్కువైంది. ఇందులో దాదాపు 67 మంది అభ్యర్థులు 720 స్కోర్ సాధించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 67 మంది అభ్యర్థుల్లో కొందరు ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన వారు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష పెట్టారు. సవరించిన ర్యాంకులు విడుదల చేశారు.