Shami on Pakistan: పాకిస్థాన్‌ను ఉతికారేయడం నా రక్తంలోనే ఉంది.. జైశ్రీరామ్ నినాదాల్లో తప్పేం లేదు: మహ్మద్ షమి
Shami on Pakistan: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ ను ఉతికారేయడం తన రక్తంలో ఉందని అనడంతోపాటు జై శ్రీరామ్ నినాదాలు చేయడంలోనూ తప్పు లేదని అతడు అనడం గమనార్హం.
Shami on Pakistan: ఓ ముస్లిం, ఓ ఇండియన్ అయినందుకు తాను గర్వపడతానని ఎప్పుడూ చెప్పే మహ్మద్ షమి తాజాగా పాకిస్థాన్, జైశ్రీరామ్ నినాదాలు, తాను వరల్డ్ కప్ లో నమాజ్ చేయబోయానన్న వివాదాలపై స్పందించాడు. న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు వివిధ అంశాలపై మాట్లాడాడు. పాకిస్థాన్ ను ఫీల్డ్ లోనూ, బయట సోషల్ మీడియాలో ఉతికి ఆరేయడం తన రక్తంలోనే ఉందని అనడం గమనార్హం.
మహ్మద్ షమి.. పాకిస్థాన్‌పై..
పాకిస్థాన్ విషయంలో విమర్శలు గుప్పించడానికి మహ్మద్ షమి ఎప్పుడూ వెనుకాడడు. అదే సమయంలో క్రికెట్ ఫీల్డ్ లోనూ ఆ జట్టుపై అతనికి మంచి రికార్డు ఉంది. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూ సందర్భంగా సదరు యాంకర్.. షమిని ప్రశ్నించారు.
"మీరు ఎక్కువగా పాకిస్థాన్ నే ఉతుకుతారు కదా" అని అడిగితే.. అది నా రక్తంలోనే ఉంది అని షమి సమాధానమివ్వడం విశేషం. గతంలో పాకిస్థాన్ నుంచి తనపై వచ్చిన విమర్శలకు కూడా షమి గట్టిగానే సమాధానమిచ్చాడు.
జై శ్రీరామ్ నినాదాలపై షమి ఏమన్నాడంటే..
ఇక ఆ మధ్య ఓ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలోని అభిమానులు షమిని చూసి జై శ్రీరామ్ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా తాజా ఇంటర్వ్యూలో షమి స్పందించాడు. జై శ్రీరామ్ నినాదాలే కాదు.. అల్లాహు అక్బర్ నినాదాలు వేయిసార్లు చేసిన ఎలాంటి తప్పు లేదని షమి అన్నాడు. అందులో ఎలాంటి తేడా లేదని అతడు స్పష్టం చేశాడు.
"ప్రతి మతంలోనూ ఓ ఐదు, పది మంది అవతలి మతం వాళ్లంటే ఇష్టపడరు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను సజ్దా చేయాలనుకున్నాననే టాపిక్ ఎలా అయితే తెరపైకి వచ్చిందో.. ఒకవేళ రామ మందిరాన్ని కట్టినప్పుడు జై శ్రీరామ్ అనడంలో సమస్య ఏముంది. దానిని వెయ్యిసార్లు చెప్పండి. ఒకవేళ నేను అల్లాహు అక్బర్ నినాదాలు చేయాలనుకుంటే వెయ్యిసార్లు చేస్తాను. అందులో తేడా ఏముంది" అని షమి ప్రశ్నించాడు.
ఫీల్డ్‌లో నమాజ్ విమర్శలపై షమి ఏమన్నాడంటే..
ఇక గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో శ్రీలంకతో మ్యాచ్ లో కసున్ రజితను ఔట్ చేసిన తర్వాత షమి మోకాళ్లపై కూర్చున్నాడు. దీంతో అతడు నమాజ్ చేయబోయి తాను ఇండియాలో ఉన్న విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయాడని పాకిస్థాన్ నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపైనా తాజాగా షమి మరోసారి స్పందించాడు.
"నేను సజ్దా చేయబోయానని అంటున్నారు. కానీ నేను చేయలేదు. కొందరు నా దేశం గురించి, మరికొందరు నా మతం గురించి మాట్లాడారు. ఎవరి మనసులో ఏముందు అది అనేశారు. నా బౌలింగ్ ను ప్రశంసించకుండా ఈ వివాదాన్ని హైలైట్ చేశారు. నేను అప్పటికే వరుసగా ఐదో ఓవర్ వేస్తున్నాను. నా సామర్థ్యానికి మించి అప్పుడు బౌలింగ్ చేశాను. అలసిపోయాను. నేను ఐదో వికెట్ తీసుకోగానే మోకాళ్లపై కూర్చున్నాను.
ఎవరో తోస్తే నేను కాస్త ముందుకు వాలాను. ఆ ఫొటోనే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేశారు. నేను సజ్దా చేయబోయానని అన్నారు. ఈ న్యూసెన్స్ ఆపమని వాళ్లకు నేను చెబుతున్నాను. ముందుగా చెప్పాలంటే నేను ఎవరికీ భయపడను. నేనో ముస్లిం. అందుకు గర్వపడుతున్నాను. నేను ఇండియన్ ను కూడా. నాకు నా దేశమే తొలి ప్రాధాన్యత. ఈ విషయాలు ఎవరినైనా బాధపెడితే నాకు సంబంధం లేదు. నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను. ఇంతకంటే కావాల్సిందేమీ లేదు. వివాదాలను పట్టించుకోను" అని షమి స్పష్టం చేశాడు.