Pakistan U19 Team: వెక్కి వెక్కి ఏడ్చిన పాకిస్థాన్ ప్లేయర్స్.. ఇండియాతో ఫైనల్ మిస్ అయిన తర్వాత..
Pakistan U19 Team: పాకిస్థాన్ అండర్ 19 టీమ్ ప్లేయర్స్ వెక్కి వెక్కి ఏడ్చారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆస్ట్రేలియా టీమ్ తో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి ఇండియా అండర్ 19తో ఫైనల్ ఆడే అవకాశాన్ని వాళ్లకు దూరం చేసింది.

Pakistan U19 Team: ఉత్కంఠభరితంగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ టీమ్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసి ఇండియా అండర్ 19తో ఫైనల్ కు సిద్ధమైంది. 180 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మాత్రమే మిగిలి ఉండగా 9 వికెట్లు నష్టపోయి ఆస్ట్రేలియా అండర్ 19 చేజ్ చేయడం గమనార్హం. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డ్ లోనే కుప్పకూలిపోయారు. వెక్కి వెక్కి ఏడ్చారు.
పాకిస్థాన్ అండర్ 19 vs ఆస్ట్రేలియా అండర్ 19
అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 8) పాకిస్థాన్, ఆస్ట్రేలియాల మధ్య రెండో సెమీఫైనల్ జరిగింది. అంతకుముందే మంగళవారం (ఫిబ్రవరి 6) జరిగిన తొలి సెమీఫైనల్లో 2 వికెట్లతో సౌతాఫ్రికా ను చిత్తు చేసి ఇండియన్ టీమ్ ఫైనల్ చేరింది. దీంతో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని కోట్లాది మంది అభిమానులు ఆశించారు.
రెండో సెమీఫైనల్లో పాక్ అండర్ 19 టీమ్ కూడా గెలిచేలానే కనిపించింది. కానీ ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ చివర్లో ఒక్క వికెట్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో సీనియర్ ఇండియా, ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం తలపడగా.. ఈసారి జూనియర్ టీమ్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది. సీనియర్ టీమిండియాకు ఎదురైన పరాభవానికి జూనియర్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
కుప్పకూలిన పాకిస్థాన్ ప్లేయర్స్
ఆస్ట్రేలియా అండర్ 19 చేతుల్లో సెమీఫైనల్లో ఓటమి తర్వాత పాకిస్థాన్ అండర్ 19 ప్లేయర్స్ ఫీల్డ్ లోనే గట్టిగా ఏడ్చేశారు. ఫీల్డ్ లో ఎక్కడి వాళ్లు అక్కడే నేల మీద కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. కాసేపటి తర్వాత టీమ్ లోని కొందరు ప్లేయర్స్ వాళ్లకు వాళ్లే ధైర్యం తెచ్చుకొని మిగతా ప్లేయర్స్ ను కూడా గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు.
ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ అండర్ కెప్టెన్ సాద్ బేగ్ మాట్లాడుతూ.. తాము 20, 30 పరుగులు తక్కువ చేసినట్లు చెప్పాడు. "ఓడిపోవడం చాలా బాధగా ఉంది. మేము కనీసం 20, 30 రన్స్ తక్కువ చేశాం. కానీ 100 శాతం పోరాడాం. వాళ్లు బాగా ఆడారు. మా వాళ్లు నిజంగా బాగా పోరాడారు. అలీ రజా చాలా బాగా బౌలింగ్ చేశాడు. టోర్నమెంట్ మొత్తం మా బౌలింగ్ బాగుంది" అని బేగ్ అన్నాడు.
ఇండియా అండర్ 19 ఆరేస్తుందా?
పాకిస్థాన్ అండర్ 19తో ఇండియా అండర్ 19 ఫైనల్ మిస్ అయింది. కానీ అండర్ 19 వరల్డ్ కప్ రికార్డు స్థాయిలో ఆరోసారి గెలిచే అవకాశం మన టీమ్ కు ఉంది. జూనియర్ ఆస్ట్రేలియా టీమ్ పై గెలిస్తే వరల్డ్ కప్ తోపాటు గతేడాది సీనియర్ టీమ్ పరాభవానికి కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చు.
మరోవైపు ఇప్పటికే మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. నాలుగో టైటిల్ పై కన్నేసింది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ఆదివారం (ఫిబ్రవరి 11) జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. వరుసగా ఐదోసారి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన యంగిండియా.. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.