Rishabh Pant RCB: రిషబ్ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే కోహ్లి వద్దన్నాడా? ఇదీ అతని రియాక్షన్-rishabh pant furious over reports of him joining rcb and virat kohli saying no says stop fake news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant Rcb: రిషబ్ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే కోహ్లి వద్దన్నాడా? ఇదీ అతని రియాక్షన్

Rishabh Pant RCB: రిషబ్ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే కోహ్లి వద్దన్నాడా? ఇదీ అతని రియాక్షన్

Hari Prasad S HT Telugu
Sep 26, 2024 07:03 PM IST

Rishabh Pant RCB: రిషబ్ పంత్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ వదిలి ఆర్సీబీలోకి వెళ్తున్నాడా? అతడు వస్తానంటే విరాట్ కోహ్లి వద్దన్నాడా? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ న్యూస్ పై తాజాగా స్పందించిన పంత్.. ఫేక్ న్యూస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రిషబ్ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే కోహ్లి వద్దన్నాడా? ఇదీ అతని రియాక్షన్
రిషబ్ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే కోహ్లి వద్దన్నాడా? ఇదీ అతని రియాక్షన్ (ANI)

Rishabh Pant RCB: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీతో చేతులు కలపబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. ఎందుకిలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారంటూ ఎక్స్ అకౌంట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఆర్సీబీలోకి వెళ్దామనుకుంటే విరాట్ కోహ్లి వద్దన్నాడని ఓ అభిమాని చేసిన ట్వీట్ పై పంత్ తీవ్రంగా స్పందించాడు.

అదంతా ఫేక్ న్యూస్

రిషబ్ పంత్ గురించి ఓ అభిమాని చేసిన ట్వీట్ మొదట వైరల్ అయింది. "రిషబ్ పంత్ ఆర్సీబీని సంప్రదించాడు. తన మేనేజర్ ద్వారా ఈ వారం మొదట్లో ఆర్సీబీ కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకొని ఆర్సీబీ మేనేజ్మెంట్ కు ప్రతిపాదన పంపించాడు. కానీ ఇండియన్ టీమ్, డీసీలో పంత్ రాజకీయ ఎత్తుగడల వల్ల విరాట్ కోహ్లి అతన్ని వద్దన్నాడని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి" అని సదరు వ్యక్తి ట్వీట్ చేశాడు.

దీనిని రీట్వీట్ చేస్తూ పంత్ ఘాటు రిప్లై ఇచ్చాడు. "ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారు. అస్సలు బాగా లేదు. కాస్త మారండి. ఎలాంటి కారణంగా లేకుండా ఓ అపనమ్మకాన్ని సృష్టించే వాతావరణాన్ని క్రియేట్ చేయకండి. నేనిది చెప్పడం ఇదే తొలిసారి కాదు.. చివరిసారి కూడా కాదు. మీ విశ్వసనీయ వర్గాలతో రీచెక్ చేసుకోండి. రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఆ తర్వాత మీ ఇష్టం. మీరనే కాదు.. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్న ఎంతో మందికి ఇది వర్తిస్తుంది" అని పంత్ అన్నాడు.

కోహ్లి వద్దన్నాడా?

రిషబ్ పంత్ ఆర్సీబీలోకి వస్తానంటే విరాట్ కోహ్లి వద్దన్నాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్త సంచలనం రేపింది. ఆర్సీబీ కెప్టెన్సీపై కన్నేసిన పంత్.. ఆ టీమ్ మేనేజ్మెంట్ తో సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఫాఫ్ డుప్లెస్సిని పంత్ తో భర్తీ చేయాలని ఆర్సీబీ భావించినా.. విరాట్ కోహ్లి వద్దన్నాడని చెప్పడం గమనార్హం.

2021 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్నాడు రిషబ్ పంత్. గతేడాది మాత్రం కారు ప్రమాదం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఏడాది మళ్లీ ఆ టీమ్ కెప్టెన్ గా అతడు తిరిగి వచ్చాడు.

ఐపీఎల్ మెగా వేలం

ఇక ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం డిసెంబర్లో జరగనుంది. ఈ నేపథ్యంలో రిటెయిన్ చేసుకునే ప్లేయర్స్ సంఖ్యపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈసారి రైట్ టు మ్యాచ్ కార్డు తీసేసి.. ఒక్కో ఫ్రాంఛైజీకి ఐదుగురు ప్లేయర్స్ వరకూ రిటెయిన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2022లో చివరిసారి మెగా వేలం జరిగింది. ఇప్పుడు జరగబోయే మరో మెగా వేలంతో అన్ని జట్లూ మరోసారి కొత్త లుక్ తో కనిపించనున్నాయి. అయితే సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీలు తమ టీమ్ నిలకడ దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో కీలక ప్లేయర్స్ అందరినీ రిటెయిన్ చేసుకునే అవకాశం కల్పించాలని బోర్డును కోరుతున్నాయి.