BCCI: బీసీసీఐ మీడియా హక్కులు వయాకామ్ 18 చేతికి.. భారత్‍లో జరిగే మ్యాచ్‍లు ఆ టీవీ చానెల్, ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో..
BCCI Media Rights: బీసీసీఐ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో ఇండియాలో బీసీసీఐ నిర్వహించే మ్యాచ్‍లన్నీ ఆ సంస్థకు చెందిన టీవీ చానెల్స్, ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే ప్రసారం కానున్నాయి.
BCCI Media Rights: ఇండియాలో బీసీసీఐ నిర్వహించే క్రికెట్ మ్యాచ్‍ల టీవీ, డిజిటల్ హక్కులను ఐదేళ్ల కాలానికి దక్కించుకుంది వయాకామ్ 18 (Viacom 18). ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ పరిధిలోని వయాకామ్ 18 కంపెనీ 2023-28 కాలానికి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) నేడు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఐదేళ్లలో భారత్‍లో టీమిండియా ఆడే క్రికెట్ మ్యాచ్‍లు (ఐసీసీ టోర్నీలు కాకుండా) స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్ నెట్‍వర్క్‌లో టెలికాస్ట్ కానుండగా.. డిజిటల్ విషయానికి వస్తే జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవనున్నాయి. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు ఐదేళ్ల కాలానికి బీసీసీఐ, వయాకామ్ 18 మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ కాలంలో మొత్తంగా 88 ద్వైపాక్షిక మ్యాచ్‍లు భారత్‍లో జరగనున్నాయి (102కు పెరిగే ఛాన్స్ ఉంది). 25 టెస్టులు, 27 వన్డేలు, 36 అంతర్జాతీయ టీ20లను.. ఆ ఐదేళ్లలో ఇండియాలో బీసీసీఐ నిర్వహించనుంది. మొత్తంగా బీసీసీఐ మీడియా హక్కులను స్టార్ ఇండియా, డిస్నీ+ హాట్‍స్టార్ నుంచి చేజిక్కించుకుంది వియాకామ్ 18.
ఐదేళ్ల కాలానికి ఇండియాలో జరిగే 88 అంతర్జాతీయ మ్యాచ్‍ల కోసం బీసీసీఐకు రూ.5,966.4కోట్లను చెల్లించేందుకు వయాకామ్ 18 అంగీకరించిందని సమాచారం. ఈ-వేలంలో సోనీ పిక్చర్స్ నెట్‍వర్క్, డిస్నీ స్టార్ కూడా తీవ్రంగా పోటీపడినా చివరికి వియాకామ్ 18 చేతికే బీసీసీఐ మీడియా హక్కులు చేరాయి. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
“తర్వాతి ఐదేళ్ల కాలానికి బీసీసీఐ మీడియా హక్కులను గెలిచిన వయాకామ్ 18కు అభినందనలు. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ టీ20 (మహిళల ఐపీఎల్) తర్వాత మన భాగస్వామ్యం బీసీసీఐ మీడియా హక్కులకు కూడా విస్తరించింది. మేము కలిసికట్టుగా భారత క్రికెట్ అభిమానులను అలరించడం కొనసాగిస్తాం” అని జైషా ట్వీట్ చేశారు.
అలాగే ఇంతకాలం సపోర్ట్ చేసిన స్టార్ ఇండియా, డిస్నీ+ హాట్‍స్టార్‌కు కృతజ్ఞతలు చెప్పారు జై షా. “కొన్నేళ్లుగా మద్దతు ఇచ్చినందుకు స్టార్ ఇండియా, డిస్నీ+ హాట్‍స్టార్‌కు పెద్ద థ్యాంక్స్. భారత క్రికెట్.. ప్రపంచంలోని నలుమూలల ఉన్న అభిమానులకు చేరడంలో మీరు కీలకపాత్ర పోషించారు” అని జైషా ట్వీట్ చేశారు.
దీంతో, స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆడనున్న మ్యాచ్‍లు (ఐసీసీ టోర్నీలు కాకుండా) ఇక స్పోర్ట్స్ 18 ఛానెల్‍లో టెలికాస్ట్ కానున్నాయి. డిజిటల్ విషయానికి వస్తే.. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి. ఐపీఎల్ డిజిటల్ హక్కులను ఇప్పటికే చేజిక్కించుకుంది వయాకామ్ 18.