Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ గొప్ప మనసు.. అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్ వీధుల్లో ఏం చేశాడో చూడండి-rahmanullah gurbaz helps needy people on ahmedabad roads after afghanistan played their last world cup 2023 match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ గొప్ప మనసు.. అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్ వీధుల్లో ఏం చేశాడో చూడండి

Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ గొప్ప మనసు.. అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్ వీధుల్లో ఏం చేశాడో చూడండి

Hari Prasad S HT Telugu
Nov 13, 2023 08:28 AM IST

Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రెహ్మనుల్లా గుర్బాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘన్ టీమ్ తన చివరి మ్యాచ్ ఆడిన తర్వాత అర్ధరాత్రి వేళ అహ్మదాబాద్ వీధుల్లో రోడ్ల పక్కన పడుకున్న వారికి సాయం చేశాడు.

ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్
ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (AFP)

Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్బాజ్ వరల్డ్ కప్ 2023 నుంచి వెళ్తూ వెళ్తూ మనసులు గెలుచుకునే గొప్ప పని చేశాడు. అహ్మదాబాద్ లో ఆఫ్ఘన్ టీమ్ శుక్రవారం (నవంబర్ 11) సౌతాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత శనివారం తెల్లవారుఝామున 3 గంటల సమయంలో అతడు అహ్మదాబాద్ వీధుల్లో తిరిగాడు.

ఓ చోట రోడ్డు పక్కన పడుకున్న వారిని చూసి రెహ్మనుల్లా గుర్బాజ్ తన కారు దిగి వారికి సాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జే లవ్ అనే వ్యక్తి ఈ వీడియో తీశాడు. ఈ వీడియోను గుర్బాజ్ ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసింది.

"ఆఫ్ఘనిస్థాన్ లో ఆ మధ్య హెరాత్ లో వచ్చిన భూకంప బాధితులకు సాయం చేయడానికి అలసట లేకుండా విరాళాలు సేకరించడం నుంచి.. విదేశీ గడ్డపై కూడా దయా గుణం చాటుకున్న నువ్వు ఎప్పుడూ మాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటావు. గాడ్ బ్లెస్ యూ జానీ" అనే క్యాప్షన్ తో కేకేఆర్ ఫ్రాంఛైజీ ఈ వీడియోను షేర్ చేసింది.

మొదట ఈ వీడియో దూరం నుంచి చూస్తే.. రోడ్డు పక్కన పడుకున్న వారిని నిద్ర లేపకుండానే వారి పక్కన అతడు ఏదో పెట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు కారు ఎక్కి వెళ్లిపోయిన తర్వాత దగ్గరికి వెళ్లి చూస్తే.. గుర్బాజ్ అక్కడ డబ్బులు పెట్టినట్లు కనిపించింది. ఒకచోటు 500, మరోచోట 1000.. ఇలా పంచుతూ వెళ్లాడు. ఓ మహిళ చెబుతుండగా.. అతడు అలా డబ్బులు వారి పక్కన పెడుతూ వెళ్లాడు.

గుర్బాజ్ గొప్ప మనసు చూసి నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత నెలలో తమ దేశంలో వచ్చిన భారీ భూకంపానికి బలైన వారి కోసం ఆఫ్ఘన్ క్రికెటర్లు ఇలాగే విరాళాలు సేకరించారు. ఇప్పుడు భారత గడ్డపై కూడా రోడ్డు పక్కన ఉంటున్న వారికి సాయం చేస్తూ గుర్బాజ్ భారతీయుల మనసులు గెలుచుకున్నాడు.

ఇక వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘన్ టీమ్ కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి టీమ్స్ కు షాకివ్వడంతోపాటు మొత్తంగా 4 మ్యాచ్ లు గెలిచి ఒక దశలో సెమీస్ రేసులోనూ నిలిచింది. అయితే చివరి మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతుల్లో ఓడిపోయింది. పాయింట్ల టేబుల్లో ఆరో స్థానంలో నిలిచి క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యపరిచింది.

Whats_app_banner