SA vs AFG: చెమటోడ్చి గెలిచిన దక్షిణాఫ్రికా
SA vs AFG ICC Cricket World Cup 2023: ప్రపంచకప్‍లో అఫ్గానిస్థాన్‍పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మోస్తరు లక్ష్యాన్ని చెమటోడ్చి ఛేదించింది సఫారీ జట్టు.
SA vs AFG ICC Cricket World Cup 2023: ఇప్పటికే వన్డే ప్రపంచకప్ సెమీస్‍కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా.. గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‍లోనూ గెలిచింది. అఫ్గానిస్థాన్‍పై సఫారీ జట్టు చెమటోడ్చి గెలిచింది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నేడు (నవంబర్ 10) జరిగిన మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‍పై విజయం సాధించింది.
245 పరుగుల మోస్తరు లక్ష్యం ముందుండగా.. కష్టపడి ఛేదించింది దక్షిణాఫ్రికా. 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 247 పరుగులు చేసి దక్షిణాఫ్రికా గెలిచింది. రాసీ వాండెర్ డుసెన్ (95 బంతుల్లో 76 పరుగులు; నాటౌట్) అర్ధ శకతంతో చివరి వరకు నిలిచాడు. క్వింటన్ డికాక్ (41) రాణించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ చెరో రెండు వికెట్లు, మజీబుర్ రహ్మన్ ఓ వికెట్ తీసుకున్నారు. అయితే, దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేస్తూ అఫ్గాన్ బౌలర్లు మ్యాచ్‍ను దాదాపు చివరి వరకు తెచ్చారు. మొత్తంగా పోరాడి ఓడింది అఫ్గానిస్థాన్.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ (97 పరుగులు నాటౌట్) మరోసారి సత్తాచాటాడు. చివరి వరకు నిలిచినా సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. లుంగీ ఎంగ్డీ, కేశవ్ మహారాజ్‍కు చెరో రెండు, ఆండిలే ఫెలుక్వాయోకు ఓ వికెట్ దక్కింది.
గ్రూప్ స్టేజీలో తన చివరి మ్యాచ్ విజయంతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్షిణాఫ్రికా మరింత పదిలం చేసుకుంది. 9 మ్యాచ్‍ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది. ప్రపంచకప్ సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఆడనుంది. ఈ టోర్నీలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 9 మ్యాచ్‍ల్లో 4 గెలిచి అదరగొట్టింది. సెమీస్‍కు అర్హత సాధించలేకపోయినా.. అద్భుతమైన ఆటతీరును ఆ జట్టు కనబరిచింది. టోర్నీ నుంచి గర్వంగానే బయటికి వెళుతోంది.
డుసెన్ చివరి వరకు..
ఈ మ్యాచ్‍లో లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికాకు మోస్తరు ఆరంభం లభించింది. కెప్టెన్ టెంబా బవూమా (23) ఎక్కువ సేపు నిలువలేదు. మరో స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (41) ఉన్నంత సేపు రాణించాడు. ఐడెన్ మార్క్‌రమ్ (25), హెన్రిచ్ క్లాసెన్ (10), డేవిడ్ మిల్లర్ (24) కూడా త్వరగానే ఔటయ్యారు. మరోవైపు రాసీ వాండర్ డుసెన్ మాత్రం నిలకడగా ఆడాడు. క్రమంగా పరుగులు రాబట్టారు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా చివరి వరకు నిలువాలన్న పట్టుదలతో శాంతంగా ఆడాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చివర్లో అతడికి ఫెలుక్వాయో (39 నాటౌట్) తోడుగా నిలిచాడు.
అర్ధ శతకం తర్వాత కూడా వాండర్ డుసెన్ నిలకడగానే ఆడాడు. ఆరో వికెట్‍కు డుసెన్, ఫెలుక్వాయో 65 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాన్ని దాటించారు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్, నబీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సహా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అఫ్గానిస్థాన్ యువ స్టార్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ 107 బంతుల్లో అజేయంగా 97 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగిలిన ఏ బ్యాటర్ కూడా కనీసం 30 రన్స్ చేయలేకపోయారు. చివర్లో నూర్ అహ్మద్ (26) అజ్మతుల్లాకు తోడుగా నిలిచాడు. మిగిలిన వాళ్లు విఫలమవటంతో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 244 పరుగులే చేయగలిగింది.