Mohammed Shami: టీమిండియాకు గుడ్ న్యూస్.. షమి వచ్చేస్తున్నాడు.. రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో స్టార్ పేస్ బౌలర్-mohammed shami returns to play ranji trophy match against madhya pradesh relief for team india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mohammed Shami: టీమిండియాకు గుడ్ న్యూస్.. షమి వచ్చేస్తున్నాడు.. రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో స్టార్ పేస్ బౌలర్

Mohammed Shami: టీమిండియాకు గుడ్ న్యూస్.. షమి వచ్చేస్తున్నాడు.. రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో స్టార్ పేస్ బౌలర్

Hari Prasad S HT Telugu

Mohammed Shami: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి గాయం నుంచి పూర్తిగా కోలుకొని మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అతడు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడబోతున్నట్లు మంగళవారం (నవంబర్ 12) క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వెల్లడించింది.

టీమిండియాకు గుడ్ న్యూస్.. షమి వచ్చేస్తున్నాడు.. రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో స్టార్ పేస్ బౌలర్ (PTI)

Mohammed Shami: మహ్మద్ షమి వచ్చేస్తున్నాడు. సుమారు ఏడాది తర్వాత అతడు మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నాడు. బుధవారం (నవంబర్ 13) నుంచి మధ్య ప్రదేశ్ తో జరగబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్ లో షమి బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ అసిసోయేషన్ ఆఫ్ బెంగాల్ వెల్లడించింది. ఇది నిజంగా టీమిండియాకు గుడ్ న్యూసే.

షమి వచ్చేస్తున్నాడు

స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి గాయం నుంచి పూర్తిగా కోలుకొని మళ్లీ బరిలోకి దిగుతున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ మంగళవారం (నవంబర్ 12) తెలిపింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత గాయం కారణంగా మళ్లీ క్రికెట్ ఆడని షమి.. ఏడాది తర్వాత ఇప్పుడు ఫీల్డ్ లోకి దిగుతున్నాడు. బుధవారం ఇండోర్లో మధ్య ప్రదేశ్ తో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ సి మ్యాచ్ లో బెంగాల్ తలపడనుంది.

నిజానికి ఇప్పటికీ అతడు ఇండర్లోని బెంగాల్ టీమ్ తో చేరలేదు. అయితే మంగళవారం రాత్రిలోపు అతడు వచ్చేస్తాడని బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా వెల్లడించాడు. ఈ మ్యాచ్ ఆడటానికి ముందు నేషనల్ క్రికెట్ అకాడెమీ కూడా అతనికి క్లియరెన్స్ ఇచ్చింది. గతేడాది నవంబర్ 23న ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత గాయంతో అతడు జట్టుకు దూరమయ్యాడు.

టీమిండియాకు గుడ్ న్యూస్

గతేడాది వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ అయిన మహ్మద్ షమి గాయం నుంచి కోలుకోవడం టీమిండియాకు గుడ్ న్యూసే. మడమ గాయంతో బాధపడుతూ సర్జరీ కూడా చేయించుకున్న షమి.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని ఎన్సీఏలో రీహ్యాబిలిటేషన్ లో కొన్ని నెలలుగా గడిపిన అతడు.. మొత్తానికి రంజీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్ ఆడబోతున్నాడు.

నిజానికి న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కే షమి వస్తాడని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో అతడు ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఆడి షమి రాణిస్తే.. కాస్త ఆలస్యంగా అయినా అతడు ఆస్ట్రేలియా ఫ్లైటెక్కే అవకాశం ఉంటుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాలో కచ్చితంగా సిరీస్ గెలవాల్సిన పరిస్థితుల్లో షమిలాంటి సీనియర్ బౌలర్ అందుబాటులోకి రావాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. న్యూజిలాండ్ తో స్వదేశంలో సిరీస్ లో వైట్ వాష్ అయిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ లకు షమి రాక కాస్త ఊరట కలిగించేదే. ప్రస్తుతం షమి లేకపోవడంతో బుమ్రాతో కలిసి సిరాజ్, ఆకాశ్ దీప్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. నవంబర్ 22 నుంచి పెర్త్ లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.