IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరికీ రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు వస్తాయి: మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో ఇద్దరు క్రికెటర్లకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు వస్తాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అనడం విశేషం. ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ ను ఆయా ఫ్రాంఛైజీలు వదిలేసుకున్నాయి.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో మరోసారి టాప్ ప్లేయర్స్ పలికే ధరలపై అంచనాలు మొదలయ్యాయి. అయితే తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం అసలు ఎవరూ ఊహించని అంచనా వేశాడు. ఈ వేలంలో వికెట్ కీపర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు వస్తాయని అనడం గమనార్హం.
ఐపీఎల్ మెగా వేలంపై ఆకాశ్ చోప్రా
ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ మెగా లీగ్ లోని పది ఫ్రాంఛైజీలు గురువారం (అక్టోబర్ 31) తాము రిటెయిన్ చేసుకునే ప్లేయర్స్ లిస్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ లను ఆయా ఫ్రాంఛైజీలు రిటెయిన్ చేసుకునే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్స్ వేలంలోకి వెళ్తే మాత్రం కోట్ల వర్షం కురుస్తుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేస్తున్నాడు. "రిషబ్ పంత్ కు చాలా పెద్ద మొత్తం రానుంది. అది రూ.25 కోట్లు కావచ్చు లేదంటే రూ.30 కోట్లు కూడా కావచ్చు. కేఎల్ రాహుల్ విషయంలోనూ అదే జరగనుంది. అతడు కూడా వికెట్ కీపర్ బ్యాటరే. ప్రతి సీజన్లో ఐదారు వందల రన్స్ చేస్తున్నాడు.
కొందరు అతని స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతుండొచ్చు. నేనో ఓ మీమ్ చూశాను. అందులో ఏముందంటే.. కేఎల్ 30 ఏళ్లు దాటాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఇక అతని పని అయిపోయినట్లే. దీంతో అతన్ని సీఎస్కే తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ అక్కడికే వెళ్తారు కదా" అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.
వేలంలోకి పంత్?
రిషబ్ పంత్ ఇప్పటికే తనను ఢిల్లీ క్యాపిటల్స్ రిటెయిన్ చేసుకునే అవకాశం లేదన్న హింట్ ఇచ్చాడు. అందుకేనేమో తాను వేలంలోకి వస్తే ఎంత మొత్తానికి అమ్ముడవుతుండొచ్చు అని ఫ్యాన్స్ ను తన ఎక్స్ అకౌంట్ ద్వారా అడగడం విశేషం. ఇక కేఎల్ రాహుల్ విషయంలో గత సీజన్ నుంచే లక్నో ఫ్రాంఛైజీ అసంతృప్తితో ఉంది.
ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా అయితే ఓ మ్యాచ్ తర్వాత ఫీల్డ్ లోనే రాహుల్ కు క్లాస్ పీకుతున్నట్లుగా ఉన్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. దీంతో అతన్ని లక్నో టీమ్ వదులుకోవడం ఖాయమే. ఆ లెక్కన ఈ ఇద్దరూ వేలంలోకి వస్తే.. ఆకాశ్ చోప్రా చెప్పినట్లు పెద్ద మొత్తాలు అందుకుంటారో లేదో చూడాలి.