IPL 2024 News: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే: తేల్చేసిన బీసీసీఐ-ipl 2024 second leg also in india confirms bcci secretary jay shah reveals a report ipl general elections bcci ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 News: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే: తేల్చేసిన బీసీసీఐ

IPL 2024 News: గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే: తేల్చేసిన బీసీసీఐ

Hari Prasad S HT Telugu
Mar 16, 2024 08:59 PM IST

IPL 2024 News: ఐపీఎల్ 2024 రెండో విడత కూడా ఇండియాలోనే జరగనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన రోజే ఈ విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేయడం గమనార్హం.

గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే: తేల్చేసిన బీసీసీఐ
గుడ్ న్యూస్.. ఐపీఎల్ రెండో విడత కూడా ఇండియాలోనే: తేల్చేసిన బీసీసీఐ

IPL 2024 News: ఎన్నికల ఏడాది ఎప్పుడు ఐపీఎల్ కు తంటానే. గతంలో ఈ మెగా లీగ్ మ్యాచ్ లు దేశం వదిలి వెళ్లిన నేపథ్యంలో ఈసారి కూడా రెండో విడత మ్యాచ్ లు యూఏఈలో జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, ఐపీఎల్ 2024 రెండో విడత మ్యాచ్ లు కూడా ఇండియాలోనే జరగనున్నట్లు బీసీసీఐ తేల్చి చెప్పింది.

ఐపీఎల్ 2024 మొత్తం ఇండియాలోనే..

దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం (మార్చి 16) రిలీజ్ అయిన సంగతి తెలుసు కదా. అంతకుముందు వరకూ ఈ లీగ్ రెండో విడత మ్యాచ్ లు విదేశాల్లో జరుగుతాయన్న వార్తలు వచ్చాయి. అయితే షెడ్యూల్ రిలీజైన తర్వాత ఐపీఎల్ 2024 రెండో విడత మ్యాచ్ లు కూడా ఇండియాలోనే జరగనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించినట్లు క్రిక్ బజ్ రిపోర్ట్ తెలిపింది.

లీగ్ ను విదేశాలకు తరలించడం లేదు అని జై షా స్పష్టం చేసినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. కొన్ని ఫ్రాంఛైజీలు టోర్నీని విదేశాలకు తరలించాలని కోరుతున్నాయని, బీసీసీఐ కూడా ఆ దిశగా పరిశీలిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా జై షా ఇచ్చిన హామీతో ఈ పుకార్లకు చెక్ పడినట్లయింది. అంతేకాదు ఐపీఎల్ 2024 రెండో లెగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే బోర్డు రిలీజ్ చేయనుంది.

ఐపీఎల్ 2024 ఫైనల్ ఆరోజేనా?

ఇక ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ ను కూడా బోర్డు రిలీజ్ చేసింది. మార్చి 22న ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ తో లీగ్ ప్రారంభం కానుంది. ఈ తొలి దశ మ్యాచ్ లు ఏప్రిల్ 7 వరకూ సాగనున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 22 మ్యాచ్ ల షెడ్యూల్ ను గతంలోనే రిలీజ్ చేశారు.

ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ కావడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను బట్టి బీసీసీఐ రెండో దశ మ్యాచ్ ల షెడ్యూల్ ప్లాన్ చేయనుంది. ఇక ఐపీఎల్ ఫైనల్ మే 26న జరగనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ విషయాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ అనుకోకుండా వెల్లడించాడు. అతడు కేకేఆర్ టీమ్ తో చేరిన తర్వాత టీమ్ మెంబర్స్ తో మాట్లాడాడు.

ఈ సందర్భంగా మే 26న మనం ఆడబోతున్నాం.. ఆడాల్సిందే అన్నట్లుగా ప్లేయర్స్ లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. దీంతో ఐపీఎల్ ఫైనల్ జరగబోయేది ఆ రోజే అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఏపీ, తెలంగాణల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ తేదీలను బట్టే హైదరాబాద్ లో రెండో దశ మ్యాచ్ ల షెడ్యూల్ వస్తుంది. తొలి దశలో మార్చి 27, ఏప్రిల్ 5వ తేదీని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

IPL_Entry_Point