IND vs PAK Asia Cup: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఆసియాకప్‍లో భారత్ సూపర్ ఫోర్‌కు చేరాలంటే..
IND vs PAK Asia Cup: ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేశాక వర్షం ఆగకుండా పడింది. దీంతో పాకిస్థాన్ లక్ష్యఛేదనకు దిగకుండానే మ్యాచ్ క్యాన్సల్ అయింది. మరి ఆసియాకప్ సూపర్ ఫోర్ స్టేజ్‍కు ఇండియా చేరాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
IND vs PAK Asia Cup: క్రికెట్ అభిమానులు ఏది జరగకూడదని కోరుకున్నారో అదే జరిగింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. ఆసియాకప్ 2023 టోర్నీలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో నేడు (సెప్టెంబర్ 2) ఇండియా, పాకిస్థాన్ మధ్య పోరు జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే, ఆ తర్వాత వర్షం పలుమార్లు పడింది. ఆటకు అవకాశం ఇవ్వలేదు. ఎంతకీ వర్షం తగ్గకపోవటంతో మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో పాకిస్థాన్ లక్ష్యఛేదనకు దిగకుండానే మ్యాచ్ ముగిసింది. ఫలితం తేలకుండానే పోరు ముగిసింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ రద్దవటంతో పాకిస్థాన్ ఆసియాకప్ సూపర్ ఫోర్ స్టేజ్‍కు చేరింది. మరి ఇండియా సూపర్ ఫోర్ చేరాలంటే ఏం చేయాలంటే..
ఆసియాకప్ గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉన్నాయి. గ్రూప్-ఏలో టాప్‍లో ఉండే రెండు జట్లు సూపర్ ఫోర్‌కు చేరతాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‍లో నేపాల్‍పై పాకిస్థాన్ గెలిచింది. భారత్‍తో మ్యాచ్ రద్దవటంతో పాక్‍కు ఓ పాయింట్ యాడ్ అయింది. ఆ టీమ్ పాయింట్లు మూడుకు చేరాయి. దీంతో సూపర్ ఫోర్‌కు పాక్ క్వాలిఫై అయింది. పాకిస్థాన్‍తో మ్యాచ్ రద్దవటంతో టీమిండియాకు కూడా ఓ పాయింట్ వచ్చింది. భారత్, నేపాల్ మధ్య సోమవారం (సెప్టెంబర్ 4) మ్యాచ్ జరగనుంది. టీమిండియా సూపర్ ఫోర్‌కు చేరాలంటే నేపాల్‍తో జరిగే మ్యాచ్ గెలవాలి. నేపాల్ పసికూన కావటంతో భారత్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ ఆ మ్యాచ్ రద్దయినా రెండు పాయింట్లతో సూపర్ ఫోర్‌కు చేరుతుంది టీమిండియా.
ఇషాన్, హార్దిక్ అదుర్స్
పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. హార్దిక్ పాండ్యా (90 బంతుల్లో 87 పరుగులు; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82 పరుగులు; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (11), స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (4), శుభ్‍మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (14) విఫలవటంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో ఇషాన్, హార్దిక్ అద్భుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‍కు 138 పరుగులు జోడించారు. ఇండియాకు పోరాడే స్కోరు అందించారు. చివర్లో జస్‍ప్రీత్ బుమ్రా (16) విలువైన పరుగులు చేశాడు. దీంతో భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో రాణించాడు. నసీమ్ షా, హరిస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. టీమిండియా బ్యాటింగ్ ముగిశాక వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఛేజింగ్‍కు దిగకుండానే ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసింది.
ఆసియాకప్ 2023 టోర్నీలో టీమిండియా తదుపరి సోమవారం (సెప్టెంబర్ 4) నేపాల్‍తో మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ గెలిస్తే సూపర్ ఫోర్‌కు భారత్ అర్హత సాధిస్తుంది.