IND vs NED Cricket World Cup: టీమిండియా అదరహో.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు.. అజేయంగా సెమీస్‍లోకి..-india vs netherlands team india registered consecutive ninth win and entering in cricket world cup 2023 semis as unbeate ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ned Cricket World Cup: టీమిండియా అదరహో.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు.. అజేయంగా సెమీస్‍లోకి..

IND vs NED Cricket World Cup: టీమిండియా అదరహో.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు.. అజేయంగా సెమీస్‍లోకి..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 12, 2023 10:47 PM IST

Cricket World Cup IND vs NED: వన్డే ప్రపంచకప్‍లో నేడు నెదర్లాండ్స్ జట్టుపై టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో లీగ్‍ దశలో 9 మ్యాచ్‍ల్లో తొమ్మిదింట గెలిచినట్టయింది. అజేయంగా సెమీ ఫైనల్‍లో అడుగుపెడుతోంది.

Cricket World Cup IND vs NED: టీమిండియా అదరహో.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు.. అజేయంగా సెమీస్‍లోకి..
Cricket World Cup IND vs NED: టీమిండియా అదరహో.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు.. అజేయంగా సెమీస్‍లోకి.. (PTI)

Cricket World Cup IND vs NED: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియా అజేయ యాత్ర విజయవంతంగా కొనసాగింది. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో తొమ్మిదింట గెలిచింది. నేడు (నవంబర్ 12) జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్‍లో నెదర్లాండ్స్‌పై భారత్ భారీ విజయం సాధించింది. దీపావళి రోజున బ్లాస్టింగ్ విక్టరీ కొట్టింది. దీంతో న్యూజిలాండ్‍తో (నవంబర్ 15న) జరిగే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‍లో అజేయంగా అడుగుపెడుతోంది టీమిండియా. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు జరిగిన లీగ్ దశ లాస్ట్ మ్యాచ్‍లో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై భారీగా గెలిచింది. దీపావళి రోజున బ్యాటింగ్, బౌలింగ్‍లో మెరుపులు మెరిపించింది భారత్.

భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజా నిడమానూరు (54), సిబ్రండ్ ఇంజిల్‍బెచ్ (45) మినహా మిలిగిన నెదర్లాండ్స్ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అరుదుగా బౌలింగ్ చేసే విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెరో వికెట్ తీసుకున్నారు.

శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) మెరుపు శతకాలతో సత్తాచాటడంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‍మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఏకంగా 410 రన్స్ చేసింది. దీపావళి రోజున హిట్టింగ్‍తో మెరుపులు మెరిపించారు భారత బ్యాటర్లు. చిన్నస్వామి స్టేడియంలో మోతెక్కించారు.

ఈ మ్యాచ్‍లో 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. దీంతో వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. చివరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి సెంచరీ చేశాడు రాహుల్. ప్రపంచకప్‍లో తన తొలి శతకాన్ని నమోదు చేసిన శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

టీమిండియా తరఫున ఈ మ్యాచ్‍లో బరిలోకి దిగిన తొలి ఐదుగురు బ్యాటర్లు 50 కంటే ఎక్కువ రన్స్ చేశారు. వన్డే ప్రపంచకప్‍లో ఓ మ్యాచ్‍లో ఐదుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.

భారత్ తదుపరి న్యూజిలాండ్‍తో ప్రపంచకప్ సెమీఫైనల్‍లో బుధవారం (నవంబర్ 15) తలపడనుంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‍లో న్యూజిలాండ్ చేతిలోనే భారత్ ఓడింది. అయితే, ఈసారి కివీస్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కసిగా ఉంది. అన్నింటికీ మించి భారత్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఫుల్ ఫామ్‍లో ఉంది.

Whats_app_banner