Ind vs Eng 4th Test Day 3: మూడో రోజు భారత్ ఆలౌట్.. అదరగొట్టిన ధృవ్ జురెల్.. అదనంగా 88 రన్స్
India vs England 4th Test Day 3 Score: రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంకా టెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే..
Ind vs Eng 4th Test Day 3 Highlights: రాంచీ వేదికగా ప్రారంభమైన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ మూడో రోజుకు చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ధృవ్ జురెల్ (30), కుల్దీప్ యాదవ్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. అప్పుడు 134 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా. ఇక ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభం తర్వాత నిలకడగా ఆడారు ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్.
75 ఓవర్స్ ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం అదే 7 వికెట్ల నష్టానికి 82 ఓవర్లలో 240 పరుగులు చేసింది టీమిండియా. అప్పుడు ధృవ్ జురెల్ 39, కుల్దీప్ యాదవ్ 25 పరుగుల వ్యక్కిగత స్కోర్ వద్ద నిలిచారు. అయితే అనంతరం బౌలింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ ప్లేయర్ అండర్సన్ ఈ ఇద్దరి భాగస్వామ్యాన్ని దెబ్బ తీశాడు. 76 పరుగుల పార్టనర్‌షిప్ వద్ద కుల్దీప్ యాదవ్‌ను బౌల్డ్ చేశాడు అండర్సన్. దాంతో టీమిండియా 253 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి ఆకాష్ దీప్ దిగాడు. తర్వాత 50 పరుగులతో హాఫ్ సెంచరీ చేసిన ధృవ్ జురెల్ బ్యాటింగ్ స్పీడ్ పెంచాడు. 98 ఓవర్స్ ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆ సమయంలో ధృవ్ జురెల్ 78 పరుగులతో, ఆకాష్ దీప్ 3 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. అనంతరం బషీర్ బౌలింగ్‌లో ఆకాష్ దీప్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరాడు. దాంతో టీమిండియా 9వ వికెట్‌ను పోగొట్టుకుంది. ఇక ఆకాష్ వికెట్‌తో తొలి ఐదు వికెట్ల ఘనతు అందుకున్నాడు బషీర్.
ఇక 102 ఓవర్స్ పూర్తయ్యే సరికి తొమ్మిది వికెట్ల నష్టంతో భారత్ 303 పరుగులకు చేరింది. ఇక మొత్తంగా 7 వికెట్ల నష్టానికి 219 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా అదనంగా 88 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ధృవ్ జురెల్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. కానీ, తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని ధృవ్ జురెల్ కోల్పోయాడు. 149 బాల్స్ ఎదుర్కున్న ధృవ్ జురెల్ 6 బౌండరీలు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి అదరగొట్టాడు.
ధృవ్ జురెల్‌తోపాటు జైశ్వాల్ (73 పరుగులు), కుల్దీప్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్స్ పడగొట్టి సత్తా చాటాడు. అతనితోపాటు టామ్ హార్ట్‌లీ 3 వికెట్స్, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీశారు.