IND vs ENG: ఎందుకిలా.. నాకు అర్థం కావడం లేదు: ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్రాడ్-india vs england 3rd test stuart broad tweeted about ranchi pitch and asked why jasprit bumrah rested ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng: ఎందుకిలా.. నాకు అర్థం కావడం లేదు: ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్రాడ్

IND vs ENG: ఎందుకిలా.. నాకు అర్థం కావడం లేదు: ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్రాడ్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 24, 2024 10:46 PM IST

India vs England 4th Test: భారత్‍తో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కాస్త పైచేయి సాధించింది. బ్యాటింగ్‍లో టీమిండియా తడబడింది. అయితే, ఈ తరుణంలో రాంచీ పిచ్‍పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. ట్వీట్ చేశాడు. బుమ్రాకు విశ్రాంతి విషయంలోనూ స్పందించాడు.

స్టువర్ట్ బ్రాడ్
స్టువర్ట్ బ్రాడ్ (Reuters)

IND vs ENG 4th Test: ఇంగ్లండ్‍తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు రెండో రోజు తడబడింది. పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో వెనువెంటనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజైన శనివారం ఆట ముగిసే సరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇంకా చేతిలో 3 వికెట్లే ఉండగా.. ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో ఉన్న ధృవ్ జురెల్ (30 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (17 నాటౌట్) ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించనున్నారు. అయితే, రాంచీ పిచ్‍ ఎందుకు అలా తయారు చేశారో, దానిపై టీమిండియా వ్యూహమేంటో తనకు అర్థం కాలేదని ఇంగ్లండ్ మాజీ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ట్వీట్ చేశాడు. మరిన్ని విషయాలపై కూడా స్పందించాడు.

రాంచీ పిచ్ బౌన్స్ చాలా అనూహ్యంగా ఉంది. స్పిన్నర్లు వేసిన కొన్ని బంతులు కనీసం మోకాలు అంత బౌన్స్ కూడా అవలేదు. మరిన్ని బంతులు ఎక్కువ బౌన్స్ అయ్యాయి. పిచ్‍పై పగుళ్లు ఎక్కువగా ఉండడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అద్భుతంగా ఆడుతున్న భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73) అలాంటి బౌన్స్ సరిగా అవని బంతికే బౌల్డ్ అయ్యాడు. అనూహ్యమైన బౌన్స్‌తో భారత బ్యాటర్లు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. దీంతో రాంచీ పిచ్ విషయంలో టీమిండియా వ్యూహాన్ని బ్రాడ్ ప్రశ్నించాడు. ఫ్లాట్ పిచ్‍లపై కూడా భారత్ సత్తాచాటిందని, అయితే ఇలాంటి పిచ్ తయారు చేయించి ఇంగ్లండ్‍కు అవకాశం వచ్చేలా చేసుకుందని ట్వీట్ చేశాడు.

రాంచీలో భారత్ ఇలాంటి పిచ్ ఎందుకు తయారు చేశారో తనకు అర్థం కాలేదని బ్రాడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నేను మామూలుగా అయితే ఇంగ్లండ్ గురించే ట్వీట్ చేస్తా. కానీ ఇది ఇండియా గురించి చేస్తున్నా. భారత్‍లోని ఫ్లాట్‍పిచ్‍లపై ఆ టీమ్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి చోట వారి స్పిన్నర్ల నైపుణ్యం బాగా ఉపయోగపడింది. ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసింది. ఇప్పుడు సరిగా బౌన్స్ అవ్వని పిచ్‍పై ఆడుతూ ప్రత్యర్థి జట్టుకు ఎక్కువగా అవకాశం ఇస్తోంది. వాళ్లు అసలు ఇలాంటి పిచ్ ఎందుకు తయారు చేశారో నాకు అర్థం కావడం లేదు?” అని బ్రాడ్ ట్వీట్ చేశాడు.

బుమ్రాకు రెస్ట్ ఎందుకో..

నాలుగో టెస్టు కోసం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా ఎందుకు విశ్రాంతి ఇచ్చిందో తనకు అర్థం కావడం లేదని స్టువర్ట్ బ్రాడ్ మరో ట్వీట్ చేశారు. రాంచీ పిచ్ రకరకాలుగా బౌన్స్ అవుతూ.. పగుళ్లతో బౌలర్లకు బాగా సహకరిస్తోందని ట్వీట్ చేశాడు. బుమ్రా వేసిన 8 ఓవర్లు గత ఇన్నింగ్స్‌(మూడో టెస్టు)లో ఇంగ్లండ్‍ను వెనక్కి నెట్టాయని, అలాంటి బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం అర్థం కావడం లేదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.

“స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ చతేశ్వర్ పుజారాను పుజారాను టీమిండియా తీసుకురావాలనుకుందా? లేకపోతే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసిందా?” అని బ్రాడ్ మరో ట్వీట్‍లో పేర్కొన్నాడు. పుజారా ఉంటే బ్యాటింగ్ లైనప్‍లో కాస్త నిలకడ తీసుకొస్తాడని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ అందుబాటులో లేకపోయినా.. జట్టు నుంచి శ్రేయస్ అయ్యర్‌ను తప్పించినా.. ఇంగ్లండ్‍తో చివరి మూడు టెస్టులకు కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. పుజారను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం పుజార.. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఆడుతూ.. నిలకడగా రాణిస్తున్నాడు.

ప్రస్తుత నాలుగో టెస్టు రెండో రోజు తొలి సెషన్‍లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73) అర్ధ శకతం చేసినా మిగిలిన భారత బ్యాటర్లు ఎక్కువ సేపు నిలువలేకపోయారు. శుభ్‍మన్ గిల్ (38) పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఓ దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత్. అయితే, చివర్లో ధృవ్ జురెల్ (30 నాటౌట్), కుల్దీప్ యాదవ్ ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజును ముగించారు. 7 వికెట్లకు 219 పరుగుల వద్ద ఆదివారం మూడో రోజు ఆటను భారత్ కొనసాగించనుంది.

Whats_app_banner