India vs England 2nd day: టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లీడ్.. పట్టు చిక్కినట్లేనా?
India vs England 2nd day: ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియాకు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో రోజు టీ సమయానికి 5 వికెట్లకు 309 రన్స్ చేసి భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.
India vs England 2nd day: తొలి టెస్టుపై ఇండియన్ టీమ్ పట్టు బిగించే దిశగా వెళ్తోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. యశస్వికి తోడు కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా టీ సమయానికి 5 వికెట్లకు 309 రన్స్ చేసింది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 63 పరుగుల లీడ్ లభించింది.
రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్
ఈ తొలి టెస్టుకు విరాట్ కోహ్లి స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో టీమ్ కు మంచి స్కోరు సాధించి పెట్టాడు. ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టానికి 119 రన్స్ తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియన్ టీమ్ కు మొదట్లోనే దెబ్బ పడింది. స్కోరు 123 రన్స్ చేరే సరికి ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (80) ఔటయ్యాడు.
అతడు రెండో రోజు కూడా ఒక ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించినా.. ఆ వెంటనే ఔటయ్యాడు. యశస్వి 74 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 80 రన్స్ చేశాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (23) కూడా కాసేపటికే ఔటైనా.. శ్రేయస్ అయ్యర్ తో కలిసి రాహుల్ నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
223 రన్స్ దగ్గర అయ్యర్ (35) ఔటయ్యాడు. ఈ సమయంలో రాహుల్ కు జడేజా జత కలిశాడు. ఈ ఇద్దరు కూడా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఐదో వికెట్ కు 65 పరుగులు జోడించారు. సెంచరీకి చేరవవుతున్న సమయంలో రాహుల్ 86 రన్స్ దగ్గర ఔటయ్యాడు. ఆ తర్వాత టీ వరకూ మరో వికెట్ పడకుండా జడేజా, భరత్ జాగ్రత్త పడ్డారు.
టీ సమయానికి జడేజ 45, భరత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ టీ వరకూ ఆరో వికెట్ కు అజేయంగా 21 రన్స్ జోడించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 రన్స్ కే ఆలౌట్ కాగా.. ఇండియాకు ఇప్పటికే 63 రన్స్ లీడ్ లభించింది. ఈ ఆధిక్యాన్ని కనీసం 150 పరుగులకు తీసుకెళ్తే.. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.