IND vs AUS: సెంచరీల మోత మోగించిన గిల్, శ్రేయస్.. చరిత్ర సృష్టించిన శుభ్‍మన్.. అగ్రెసివ్‍గా అయ్యర్ సెలెబ్రేషన్స్: వీడియో
IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత బ్యాటర్లు శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అదరగొట్టారు. సెంచరీల మోత మెగించారు. వివరాలివే..
IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ దుమ్మురేపుతున్నారు. టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్‍కు దిగగా.. శుభ్‍మన్ గిల్ (97 బంతుల్లో 104 పరుగులు; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105 పరుగులు; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదేశారు. శతకాలతో సత్తాచాటారు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో నేడు (సెప్టెంబర్ 24) ఈ మ్యాచ్ జరుగుతోంది. శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపారు. సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో గిల్ మరో రికార్డు సృష్టించాడు. ఆ వివరాలివే..
భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (8) త్వరగానే ఔటైనా.. ఆ తర్వాత శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మాస్ హిట్టింగ్ చేశారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. బౌండరీలతో విరుచుకపడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించారు. దీంతో కేవలం 10 ఓవర్లలోనే భారత్ స్కోరు 80 పరుగులకు చేరింది. ఈ క్రమంలో 37 బంతుల్లోనే అర్ధ శకతానికి చేరాడు శుభ్‍మన్ గిల్. అద్భుతమైన సిక్సర్‌తో హాఫ్ సెంచరీకి చేరాడు. దూకుడుగా ఆడిన శ్రేయస్ అయ్యర్ కూడా 41 బంతుల్లోనే అర్ధ శకతం చేశాడు.
ఆ తర్వాత కూడా శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఆసీస్ బౌలర్లను బాదేశారు. వేగంగా పరుగులు రాబట్టారు. మైదానం నలుమూలల మోత మోగించారు. వీరి దూకుడుతో 28.3 ఓవర్లలోనే భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. దూకుడు పెంచిన శ్రేయస్ అయ్యర్ 86 బంతులకే సెంచరీకి చేరాడు. చాలా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో అయ్యర్‌కు ఇది మూడో శతకం. ప్రపంచకప్‍నకు ముందు అతడు ఫామ్‍లోకి రావడం టీమిండియాకు పెద్ద ప్లస్‍గా ఉంది. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చాక సెంచరీ చేయటంతో అయ్యర్‌కు కూడా ఇది కీలకంగా ఉంది. కాగా, ఆ తర్వాత భారీ షాట్ కొట్టబోయి 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ ఔటయ్యాడు.
చరిత్ర సృష్టించిన గిల్
అదే దూకుడు కొనసాగించిన శుభ్‍మన్ గిల్ 92 బంతుల్లో సెంచరీకి చేరాడు. వన్డేల్లో అతడికి ఇది ఆరో శతకం. చరిత్రలో అత్యంత వేగం(35 ఇన్నింగ్స్)గా ఆరు వన్డే సెంచరీలు పూర్తి చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. శిఖర్ ధవన్ (46 ఇన్నింగ్స్)ను అధిగమించాడు. అనంతరం 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసీస్ పేసర్ గ్రీన్ బౌలింగ్‍లో కేరీకి క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు.
అనంతరం కేఎల్ రాహుల్(52), సూర్య కుమార్ యాదవ్ (72 నాటౌట్) అర్ధ శకకాలతో సత్తాచాటారు. దీంతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరు చేసింది భారత్.