India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు టీమిండియా తుది జట్టు ఇదే.. ఆ ముగ్గురికీ పరీక్షే!
India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు టీమిండియా తుది జట్టు దాదాపు ఖాయమైంది. ఈ టీమ్ లోకి సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తోపాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి రానున్నారు.
India vs Australia: ఆస్ట్రేలియాతో ఇండియా తొలి వన్డేకు సిద్ధమైంది. ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన తర్వాత ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి వన్డే శుక్రవారం (సెప్టెంబర్ 22) మొహాలీలో జరగనుంది. తొలి రెండు వన్డేలకు రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ లేకపోవడంతో బెంచ్ స్ట్రెంత్ ను పరీక్షించే అవకాశం ఇండియాకు దక్కనుంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే ఆడే తుది జట్టులోకి చాలా కాలం తర్వాత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతనితోపాటు గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ కూడా రానున్నాడు. ఇక వన్డేల్లో తనను తాను నిరూపించుకోవడానికి సూర్యకుమార్ యాదవ్ కు మరో అవకాశం రానుంది.
తొలి వన్డేకు టీమ్ ఇదేనా?
ఇండియా తరఫున జనవరి, 2022లో చివరిసారి వన్డే మ్యాచ్ ఆడిన అశ్విన్ ను అనూహ్యంగా వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేశారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో సెలక్టర్లు అశ్విన్ వైపు చూశారు. అయితే ఇన్నాళ్లుగా వన్డేలకు దూరంగా ఉన్న అశ్విన్ ఎంత మేర రాణిస్తాడన్నది చూడాలి.
ఇక తొలి వన్డే జరగబోయే మొహాలీ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదు. పైగా రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం కూడా ఉండనుంది. దీంతో అశ్విన్ కు ఈ మ్యాచ్ ఓ సవాలుగా మారనుంది. అదే సమయంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి, వరల్డ్ కప్ కోసం ఎంపికైన సూర్యకుమార్ తన సెలక్షన్ ను సమర్థించుకోవడానికి కూడా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.
మరోవైపు ఆస్ట్రేలియా తొలి వన్డేలో ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ సేవలు కోల్పోయింది. స్టార్క్, మ్యాక్స్‌వెల్ గాయాలతో దూరమయ్యారు. సౌతాఫ్రికా చేతుల్లో 2-3తో సిరీస్ ఓడిపోయి ఇండియా వచ్చిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ ఇప్పటికే దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన లబుషేన్ పై ఆ టీమ్ భారీ ఆశలే పెట్టుకుంది.
ఇండియా తుది జట్టు అంచనా: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కేమెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా