India vs Australia 3rd T20I: గౌహతిలోనే ముగించేస్తారా.. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టీ20 ఇవాళే.. ఆ ఒక్క మార్పు తప్పదా?-india vs australia 3rd t20i washington sundar in place of axar patel ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia 3rd T20i: గౌహతిలోనే ముగించేస్తారా.. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టీ20 ఇవాళే.. ఆ ఒక్క మార్పు తప్పదా?

India vs Australia 3rd T20I: గౌహతిలోనే ముగించేస్తారా.. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టీ20 ఇవాళే.. ఆ ఒక్క మార్పు తప్పదా?

Hari Prasad S HT Telugu
Nov 28, 2023 08:51 AM IST

India vs Australia 3rd T20I: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ గౌహతిలోనే ముగించేయాలని టీమిండియా భావిస్తోంది. మూడో టీ20 మంగళవారం (నవంబర్ 28) జరగనుంది. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో యంగిండియా గెలిచిన విషయం తెలిసిందే.

రింకు సింగ్
రింకు సింగ్ (AP)

India vs Australia 3rd T20I: వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఎదురైన పరాభవానికి తొలి టీ20ల్లో గట్టిగానే బదులు తీర్చుకుంది యంగిండియా. ఇక ఇప్పుడు మంగళవారం (నవంబర్ 28) గౌహతిలో జరగబోయే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ ఇక్కడే ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కు ఇండియన్ టీమ్ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో టీ20లోనూ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. విశాఖపట్నం, తిరువనంతపురంలలో జరిగిన తొలి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ కాస్త కష్టంగా గెలిచినా.. రెండో మ్యాచ్ ను సులువుగానే ముగించింది.

ఆ ఒక్క మార్పు తప్పదా?

ఆస్ట్రేలియాతో గౌహతిలో జరగబోయే మూడో టీ20 మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఒక మార్పు తప్పేలా లేదు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ తొలి రెండు మ్యాచ్ లలో కలిపి కేవలం ఒకే వికెట్ తీసుకున్నాడు. పరుగులు కట్టడి చేస్తున్నా.. వికెట్లు తీయడంలో అతడు విఫలమయ్యాడు.

దీంతో ఈ మ్యాచ్ కు అక్షర్ స్థానంలో సుందర్ ని తీసుకునే ఆలోచనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు లేవు. ఓపెనర్లుగా యశస్వి, రుతురాజ్.. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఐదో స్థానంలో తిలక్ వర్మ, ఆరో స్థానంలో రింకు సింగ్ సెటిలయ్యారు.

ఇక బౌలింగ్ లో రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఉంటారు. అవేష్ ఖాన్ రూపంలో మరో పేస్ బౌలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నా.. ఆ మార్పు చేయకపోవచ్చు.

ఆస్ట్రేలియాతో మూడో టీ20కి తుది జట్టు ఇదేనా?

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్

Whats_app_banner