Ind vs NZ 3rd Test: మూడో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. తుది జట్టులోకి రానున్న కేకేఆర్ పేస్ బౌలర్!-ind vs nz 3rd test bumrah to sit out harshit rana to make debut india vs new zealand mumbai test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz 3rd Test: మూడో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. తుది జట్టులోకి రానున్న కేకేఆర్ పేస్ బౌలర్!

Ind vs NZ 3rd Test: మూడో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. తుది జట్టులోకి రానున్న కేకేఆర్ పేస్ బౌలర్!

Hari Prasad S HT Telugu
Oct 30, 2024 09:20 AM IST

Ind vs NZ 3rd Test: న్యూజిలాండ్ తో జరగబోయే మూడో టెస్టు కోసం తుది జట్టులో మరోసారి టీమిండియా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ పేస్ బౌలర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో కేకేఆర్ యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మూడో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. తుది జట్టులోకి రానున్న కేకేఆర్ పేస్ బౌలర్!
మూడో టెస్టు నుంచి బుమ్రా ఔట్.. తుది జట్టులోకి రానున్న కేకేఆర్ పేస్ బౌలర్! (PTI)

Ind vs NZ 3rd Test: టీమిండియా ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోవడం ఒకెత్తయితే.. 24 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్ వైట్ వాష్ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో మూడో టెస్టుకు కూడా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే హడావిడిగా జట్టులోకి వచ్చిన పేస్ బౌలర్ హర్షిత్ రాణా టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

బుమ్రా స్థానంలో హర్షిత్

హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నా.. ఎవరి స్థానంలో అన్నదానిపై ఇంకా డైలమా నెలకొంది. ఒకవేళ ముంబై పిచ్ ఎప్పటిలాగే పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తే.. ఒక స్పిన్నర్ ను పక్కన పెట్టి మూడో పేసర్ గా హర్షిత్ ను తీసుకోవచ్చు. లేదంటే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. స్పిన్ పిచ్ తయారు చేయాలని క్యూరేటర్ కు ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పడం నిజమే అయితే.. బుమ్రా లేదా ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రావచ్చు.

ఒకవేళ పుణెలాగే ముంబైలోనూ స్పిన్ పిచ్ తయారు చేస్తే మాత్రం బుమ్రాను పక్కన పెట్టడం సరైన నిర్ణయమే అవుతుంది. అతడు స్వదేశంలో విశ్రాంతి లేకుండా వరుసగా నాలుగు టెస్టులు ఆడేశాడు. ఈ నేపథ్యంలో పేస్ కు అంతగా అనుకూలించని పిచ్ పై బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం సరైనదే.

బ్యాటింగ్‌కూ మంచిదే

ఎప్పుడూ లేని విధంగా స్వదేశంలో టీమిండియా పిచ్ డైలమా ఎదుర్కొంటోంది. ఎందుకంటే బెంగళూరులో జరిగిన తొలిటెస్టులో సీమింగ్ కండిషన్స్ న్యూజిలాండ్ కు అనుకూలించి ఆ టీమ్ గెలిచింది. అలా కాదని పుణెలో మనకు అనుకూలించే స్పిన్ పిచ్ తయారు చేయించారు. అయితే అక్కడ న్యూజిలాండ్ కంటే మన బ్యాటర్లే తడబడి చేజేతులా ఓటమి కొనితెచ్చుకున్నారు.

బ్యాటింగ్ కుప్పకూలుతుండటంతో హర్షిత్ రాణాలాంటి ఆల్ రౌండర్ లోయర్ ఆర్డర్ లో ఉండటం మంచిదన్న నిర్ణయానికి కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వచ్చారు. పైగా అతడు అస్సాంతో రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున 7 వికెట్లు తీయడంతోపాటు 8వ స్థానంలో వచ్చి 59 పరుగులు చేశాడు. ఇలాగే రంజీ ట్రోఫీలో రాణించిన వాషింగ్టన్ సుందర్ ను వెంటనే రెండో టెస్టులోకి తీసుకోగా.. అతడు అంచనాలను మించి రాణించాడు.

హర్షిత్‌ను పరీక్షించడానికీ..

టీమిండియా నవంబర్ చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు పట్టుబట్టి మరీ హర్షిత్ రాణాను కోచ్ గంభీర్ తీసుకున్నాడు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని రాణాలాంటి ప్లేయర్ ను నేరుగా ఆస్ట్రేలియా టూర్ కు తీసుకెళ్లడం సాహసమే.

ఈ నేపథ్యంలో ఆ కీలకమైన సిరీస్ కు ముందు హర్షిత్ సత్తా ఎంతో చూడటానికి న్యూజిలాండ్ తో మూడో టెస్టు ఉపయోగపడనుంది. అందుకే శుక్రవారం (నవంబర్ 1) నుంచి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ప్రారంభం కాబోయే మూడో టెస్టు తుది జట్టులో హర్షిత్ తన టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బుమ్రాను పక్కన పెడతారా లేక మరో బౌలర్ నా అన్నది చూడాలి.

Whats_app_banner