Bumrah World Number 1: బుమ్రా ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్.. టెస్టు ర్యాంకుల్లో దూసుకొచ్చిన కోహ్లి, యశస్వి
Bumrah World Number 1: బుమ్రా టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ తాజా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో దూసుకెళ్లారు.
Bumrah World Number 1: బంగ్లాదేశ్ ను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజా టెస్టు ర్యాంకుల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. విరాట్ కోహ్లి మరోసారి టాప్ 10లోకి రాగా.. యశస్వి కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తొలి టెస్టు ముగిసిన తర్వాత నంబర్ వన్ గా నిలిచిన అశ్విన్.. ఇప్పుడు బుమ్రా దెబ్బకు రెండో స్థానానికి పడిపోయాడు.
బుమ్రా వరల్డ్ నంబర్ వన్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ను బుధవారం (అక్టోబర్ 2) రిలీజ్ చేశారు. బంగ్లాదేశ్ తో మంగళవారం (అక్టోబర్ 1) జరిగిన రెండో టెస్టును ఐదు సెషన్లలోనే ముగించిన టీమిండియా ప్లేయర్స్ ఈ ర్యాంకుల్లో దూసుకెళ్లారు.
ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ మూడేసి వికెట్లు తీసి.. విజయంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. బుమ్రా 870 పాయింట్లతో టాప్ లో ఉండగా.. అతని కంటే కేవలం ఒక పాయింట్ తక్కువగా 869 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు.
యశస్వి దూకుడు
ఇక కాన్పూర్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోనూ మెరుపు హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా తాజా ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ప్రస్తుతం అతడు రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవడం విశేషం. అతని కంటే ముందు జో రూట్, కేన్ విలియమ్సన్ ఉన్నారు.
ఈ మ్యాచ్ లో యశస్వియే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గతేడాది వెస్టిండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన యశస్వి.. ఇప్పటి వరకూ 11 టెస్టుల్లో ఏకంగా 64.05 సగటుతో 1271 రన్స్ చేశాడు. అందులో రెండు వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లి మళ్లీ పైకి..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు ర్యాంకుల్లో మళ్లీ పైకి దూసుకెళ్లాడు. కాన్పూర్ టెస్టులో అతడు వరుసగా 47, 29 స్కోర్లు చేయడంతో తాజా ర్యాంకుల్లో విరాట్ 6వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అతని కంటే పైన స్టీవ్ స్మిత్ 4, ఉస్మాన్ ఖవాజా 5వ స్థానాల్లో ఉన్నారు. ఈ కాన్పూర్ టెస్టులోనే కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత అశ్విన్ రెండో ర్యాంకుకు పడిపోయినా.. ఈ సిరీస్ అతనికి ఎప్పటికీ మరచిపోలేనిదే. తొలి టెస్టులో సెంచరీతోపాటు ఆరు వికెట్లు.. రెండో టెస్టులో ఐదు వికెట్లు తీశాడు. అంతేకాదు ఈ సిరీస్ లోనే షేన్ వార్న్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక ఐదు వికెట్లు (37 సార్లు) తీసిన రికార్డును కూడా అశ్విన్ సమం చేశాడు.