IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ జోరుకు సిరాజ్ బ్రేక్ - ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం
IND vs ENG 3rd Test: రాజ్ కోట్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ నాలుగు వికెట్లతో రాణించాడు.
IND vs ENG 3rd Test: మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను సిరాజ్, కుల్దీప్, జడేజా దెబ్బకొట్టారు. వీరి జోరుతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాకు 126 పరుగుల ఆధిక్యం దక్కింది.
ఆరంభంలో బుమ్రా...ఆ తర్వాత కుల్దీప్
మూడో రోజు ఆరంభంలోనే టీమిండియాకు బుమ్రా బ్రేకిచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే రూట్‌ను ఔట్ చేశాడు. రూట్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో యశస్వి జైస్వాల్ ఎలాంటి తడబాటు లేకుండా పట్టాడు. రూట్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు.
కేవలం నాలుగు బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో ను ఎల్‌బీడబ్ల్యూగా కుల్దీప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతోన్న డకెట్‌ను కుల్దీప్ యాదవ్ తెలివిగా బోల్తా కొట్టించి టీమిండియా ఫ్యాన్స్‌లో ఆనందం నింపాడు. 151 బాల్స్‌లో 23 ఫోర్లు, రెండు సిక్సర్లతో 153 పరుగులు చేశాడు డకెట్. టెస్టుల్లో ఇండియా పిచ్‌లపై అత్యంత వేగంగా 150 పరుగులు పూర్తిచేసుకున్న విదేశీ క్రికేటర్‌గా డకెట్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
సిరాజ్ జోరు…
మరో వికెట్ పడకుండా ఇంగ్లండ్‌ను కెప్టెన్ బెన్ స్టోక్స్, ఫోక్స్ ఆదుకున్నారు. లంచ్ టైమ్ కు ఇంగ్లండ్ 290 పరుగులు చేసింది. సెకండ్ సెషన్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఫోక్స్‌ను సిరాజ్ ఔట్ చేయగా...కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జడేజా పెవిలియన్ పంపించాడు. పట్టుదలతో క్రీజులో ఆడిన స్టోక్స్ ఆరు ఫోర్లతో 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత మిగిలిన టెయిలెండర్ల పని సిరాజ్ పట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకోగా, జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. బుమ్రా, అశ్విన్ లకు ఒక్కో వికెట్ దక్కింది.
అశ్విన్ దూరం
మూడో టెస్ట్ నుంచి అశ్విన్ మధ్యలోనే వైదొలిగాడు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో శుక్రవారం అతడు రాజ్ కోట్ నుంచి చెన్నై వెళ్లిపోయాడు. అశ్విన్ స్థానంలో దేవదత్ ఫడిక్కల్ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేశాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతోన్న ఈ మూడో టెస్ట్‌లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 445 పరుగులు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 131, రవీంద్ర జడేజా 112 పరుగులతో టీమిండియాను ఆదుకున్నారు. రాజ్ కోట్ టెస్ట్‌తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతో రాణించాడు.