ICC ODI Team of the Year for 2023: రోహిత్ శర్మ కెప్టెన్.. వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో సగానికిపైగా మనోళ్లే-icc mens odi team of the year sees 6 indan players with rohit sharma as captain ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Odi Team Of The Year For 2023: రోహిత్ శర్మ కెప్టెన్.. వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో సగానికిపైగా మనోళ్లే

ICC ODI Team of the Year for 2023: రోహిత్ శర్మ కెప్టెన్.. వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో సగానికిపైగా మనోళ్లే

Hari Prasad S HT Telugu
Jan 23, 2024 01:23 PM IST

ICC ODI Team of the Year for 2023: ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ లోనూ టీమిండియా ప్లేయర్స్ హవా కొనసాగింది. ఈ టీమ్ కు కెప్టెన్ రోహిత్ కాగా.. ఏకంగా ఆరుగురు ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు.

వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కించుకున్న కుల్దీప్, రోహిత్, విరాట్
వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కించుకున్న కుల్దీప్, రోహిత్, విరాట్ (AFP)

ICC ODI Team of the Year for 2023: ఐసీసీ 2023 ఏడాదికిగాను మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ ను అనౌన్స్ చేసింది. ఇందులో ఏకంగా ఆరుగురు ఇండియన్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. ఇక కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకు దక్కడం విశేషం.

గతేడాది బ్యాట్ తోపాటు కెప్టెన్ గానూ అతడు సక్సెస్ సాధించాడు. ఇండియన్ టీమ్ ను వరల్డ్ కప్ ఫైనల్ కు తీసుకెళ్లాడు. అతనితోపాటు మరో ఐదుగురు టీమిండియా ప్లేయర్స్ కూడా ఈ జట్టులో ఉన్నారు.

ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ ఇదే

సోమవారం (జనవరి 22) మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ ను అనౌన్స్ చేసిన ఐసీసీ.. మంగళవారం (జనవరి 23) వన్డే టీమ్ ను ప్రకటించింది. దీనికి కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండగా.. ఇండియన్ టీమ్ నుంచి శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమిలకు కూడా చోటు దక్కింది. ఈ ఆరుగురు ప్లేయర్స్ 2023లో టీమిండియా సక్సెస్ లో కీలకపాత్ర పోషించారు.

రోహిత్ శర్మ గతేడాది వన్డేల్లో ఏకంగా 52 సగటుతో 1255 రన్స్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లి తన టాప్ ఫామ్ కొనసాగిస్తూ 2023లో వన్డేల్లో 1377 రన్స్ చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 50వ సెంచరీ కూడా అందులో ఒకటి. గతేడాది వరల్డ్ కప్ లోనే కోహ్లి 765 రన్స్ చేయడం విశేషం. అందులో మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో ఇదే అత్యధిక రన్స్ కావడం విశేషం.

ఇక శుభ్‌మన్ గిల్ కూడా 2023లో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడు గతేడాది ఏకంగా 1584 రన్స్ చేశాడు. అందులో న్యూజిలాండ్ పై హైదరాబాద్ లో చేసిన డబుల్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు వరల్డ్ కప్ లో 24 వికెట్లతో మహ్మద్ షమి కూడా ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. కేవలం 7 మ్యాచ్ లలోనే 24 వికెట్లతో ఒక ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

మరో పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా 2023లో వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఆసియా కప్ ఫైనల్లో నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆరు వికెట్లు తీసి ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే 2023లో ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత అతనిదే. వన్డేల్లో ఒక్క ఏడాదిలోనే అతడు 49 వికెట్లు తీశాడు.

ఈ ఇండియన్ ప్లేయర్స్ కాకుండా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్, ఆడమ్ జంపా, న్యూజిలాండ్ ను సెమీస్ చేర్చిన డారిల్ మిచెల్, సౌతాఫ్రికాను సెమీస్ వరకూ తీసుకొచ్చిన హెన్రిచ్ క్లాసెన్, మార్కో యాన్సెన్ లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023 ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, ఆడమ్ జంపా, సిరాజ్, కుల్దీప్, షమి

Whats_app_banner