Ruturaj Gaikwad: ‘ధోనీ నుంచి చాలా నేర్చుకున్నా.. కానీ’: రుతురాజ్ గైక్వాడ్
Ruturaj Gaikwad: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు సారథ్యం వహించే ముందు అతడు మాట్లాడాడు.
Ruturaj Gaikwad: ఏషియన్ గేమ్స్‌లో టీమిండియాకు కెప్టెన్సీ చేసేందుకు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ రెడీ అయ్యాడు. భారత ప్రధాన జట్టు వన్డే ప్రపంచకప్ ఆడనుండగా.. అదే సమయంలో ఏషియన్ గేమ్స్ ఉండటంతో ఇతర ఆటగాళ్లతో మరో టీమ్‍ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. రుతురాజ్ గైక్వాడ్‍ను కెప్టెన్ చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో టీమిండియాకు రుతురాజ్ సారథ్యం వహించనున్నాడు. ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్‍లో టీమిండియా రేపు (అక్టోబర్ 3) తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో తొలిసారి భారత్‍కు కెప్టెన్సీ చేయనున్నాడు రుతురాజ్ గైక్వాడ్. ఈ తరుణంలో నేడు మీడియాతో అతడు మాట్లాడాడు.
ఐపీఎల్‍లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫునే రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్నాడు. దీంతో ధోనీ స్టైల్‍లోనే రుతురాజ్ కెప్టెన్సీ కూడా ఉండనుందనే భావనలు ఉన్నాయి. ఈ విషయంపైనే అతడికి ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి రుతురాజ్ గైక్వాడ్ సమాధానాలు చెప్పాడు. ధోనీ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, కానీ ప్రతీ ఒక్కరికి డిఫరెంట్ స్టైల్ ఉంటుందని అన్నాడు. ధోనీ నుంచి నేర్చుకున్న విషయాలను పాటిస్తూనే.. తన స్టైల్‍లో కెప్టెన్సీ చేస్తానని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.
“అతడి (ధోనీ) నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. కానీ ప్రతీ ఒక్కరికి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అతడి స్టైల్, పర్సనాలిటీ విభిన్నం. నా పర్సనాటిలీ డిఫరెంట్. నేను నాలాగే ఉండేందుకు ట్రై చేస్తా. అతడిలాగానే చేయాలని అనుకోను. అయితే, ధోనీ చేసే కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. పరస్థితులను, మ్యాచ్‍లో నిర్ధిష్టమైన ప్లేయర్లను అతడు ఎలా హ్యాండిల్ చేస్తాడో వాటిని అనుసరించాలి. ఇలాంటి కొన్ని విషయాల్లో నేను అతడిని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తా. కానీ, కెప్టెన్సీ మాత్రం నేను చేయాలనుకుంటున్నట్టు చేస్తా. ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడేందుకు కావాల్సిన పూర్తి స్వాతంత్య్రాన్ని ఇవ్వాలనుకుంటున్నా” అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. రుతురాజ్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకం సాధిస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ పోరును మంగళవారం (అక్టోబర్ 3) నేపాత్‍తో జరిగే మ్యాచ్‍తో మొదలుపెట్టనుంది టీమిండియా.
ఏషియన్ గేమ్స్ ఆడుతుండడం చాలా సంతోషంగా ఉందని, దేశం కోసం స్వర్ణ పతకం సాధించి పోడియంపై నిల్చోవాలనేదే తమ లక్ష్యమని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.